AP Police Trying to Stop Car Rally of IT Employees: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరం కార్ల యాత్రకు పిలుపునిచ్చిన విషయం విథితమే. అయితే ఈ కార్ల ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. తెలంగాణ నుంచి ఏపీకి ఐటీ ఉద్యోగులు రావటాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు విజయవాడ వైపు రాకుండా చెక్‌పోస్టుల వద్ద నిలుపుదల చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలించి.. నిర్ధారణకు వచ్చిన తర్వాతే వదులుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామం ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్కడి నుంచి వదులుతున్నారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎలాంటి నిరసనలు ధర్నాలు ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
తెల్లవారుజామున రెండు గంటల నుండి జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జానకిరామ్ ఆధ్వర్యంలో అనుమంచిపల్లి కోల్డ్ స్టోరేజ్ వద్ద మరియు బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానం ఉన్న ప్రతీ వాహనాన్ని ముఖ్యంగా కార్లను పోలీసులు ఆపేస్తున్నారు.
ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు ఇవాళ ఛలో రాజమండ్రి సంఘీభావ కార్ల యాత్రకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను అనుమంచిపల్లి వద్ద నిలుపుదల చేస్తున్నారు.
కార్ల ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని.. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందంటూ పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు విజయవాడ వైపు రాకుండా చెక్‌పోస్టు వద్ద అడ్డుకుంటున్నారు. సరైన పత్రాలు ఉంటేనే కార్లను అనుమతిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఐటీ ఉద్యోగులు వివిధ మార్గాల్లో రాజమండ్రికి చేరుకుంటున్నట్లు సమాచారం.
హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఐటీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడాన్ని టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ విభాగం అధ్యక్షురాలు తేజస్విని తీవ్రంగా తప్పుబట్టారు. భారతదేశంలో స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లగలుగుతున్నమని.. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు రాలేకపోతున్నామని మండిపడ్డారు. ఏపీ భారతదేశంలో భాగం కాదన్నట్లు గా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.