AP High Court hearing on CBN Angallu Bail Petition: అంగళ్లు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేష్‌రెడ్డి ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన సందర్భంగా అంగళ్లు కూడలి వద్ద చోటు చేసుకున్న ఘటనలో టీడీపీ నేతలతోపాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 8న కేసు నమోదు చేసిన విషయం విదితమే.
ఈ కేసులో బెయిలు కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించగా.. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్ స్కిల్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున ప్రస్తుత కేసులోనూ అరెస్టు అయినట్లు భావించాలన్నారు. ఈ నేపథ్యంలోనే బెయిలు పిటిషన్ వేశామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తమ పిటిషన్‌కు విచారణార్హత ఉందని న్యాయస్థానం ముందుంచారు.
Supreme Court Hearing on Chandrababu Case: చంద్రబాబు కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
అధికార పార్టీకి చెందిన వారు అంగళ్లులో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు విసిరారన్నారు. వ్యక్తిగత భద్రత సిబ్బంది చంద్రబాబుకు రక్షణగా నిలిచిందన్నారు. అందుకు సంబంధించిన వీడియోలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీకి చెందిన వారు దాడులకు పాల్పడి నాలుగు రోజుల ఆలస్యంగా తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే ర్యాలీ నిర్వహించారన్నారు.
ర్యాలీలో అలజడులు సృష్టించాలని ముందస్తు ప్రణాళికతో అధికార పార్టీకి చెందిన వారు రాళ్లు రువ్వారని.. ఇదే కేసులో నిందితులుగా ఉన్న పలువురికి హైకోర్టు బెయిలు మంజూరు చేసిందని గుర్తు చేశారు. దీంతో ఈ కేసులో పిటిషనర్‌కు బెయిలు ఇవ్వాలని కోరారు. పోలీసుల తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బెయిలు పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్నారు. పిటిషనర్ ప్రోద్భలంతో దాడి ఘటన చోటు చేసుకుందన్నారు. పిటిషనర్, ఆయన అనుచరులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు. పిటిషనర్ చెప్పాకే దాడులకు దిగారన్నారు. పోలీసులకు గాయాలయ్యాయన్నారు. బెయిలు పిటిషన్ కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో బెయిలు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు అనిశా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఇదే కేసులో మరో ఐదు రోజులు చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సైతం బుధవారానికి వాయిదా పడింది. వాస్తవానికి ఈ రెండు పిటిషన్లపై మంగళవారం అనిశా కోర్టు విచారణ జరపాల్సి ఉండగా.. న్యాయాధికారి సెలవులో ఉండటంతో.. ఈ పిటిషన్లు ఇంఛార్జి కోర్టు న్యాయాధికారి/మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎ.సత్యానంద్ ఎదుట విచారణకు వచ్చాయి.
చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు ప్రమోద్‌కుమార్ దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. పోలీసు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేశామన్నారు. చంద్రబాబు ప్రస్తుతం జైల్లో ఉన్నారని, వ్యక్తిగత స్వేచ్ఛతో కూడిన వ్యవహారం కాబట్టి బెయిలు పిటిషన్‌పై విచారణ జరపాలని కోరారు. న్యాయాధికారి స్పందిస్తూ ఒక్కరోజులో వాదనలు విని ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదన్నారు. అనిశా కోర్టు జడ్జి ముందు బుధవారం విచారణ జరపాలని పేర్కొంటూ విచారణను వాయిదా వేశారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్‌ను నిందితుడిగా చేరుస్తూ అనిశా కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది.