AP High Court Dismissed Chandrababu Quash Petition: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) నిధుల వినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్.. దాని ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టు తనకు జ్యుడిషియల్ రిమాండు విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
భజన్‌లాల్ కేసు మొదలు నిహారిక ఇన్‌ఫ్రా కేసు వరకూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుంటే.. సీఆర్‌పీసీ సెక్షన్ 482 ప్రకారం ప్రస్తుత కేసులో ఈ దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. కేసుకు సంబంధించిన వాస్తవాల విషయంలో ఇరువైపుల సీనియర్ న్యాయవాదులు లేవనెత్తిన అంశాలపై సెక్షన్ 482 కింద హైకోర్టు మినీ ట్రైల్ నిర్వహించడానికి వీల్లేదని పేర్కొంది. అదే విధంగా కేసు 2021 డిసెంబరు 9న నమోదైందని, దర్యాప్తు సంస్థ 140 మందికి పైగా సాక్షులను విచారించి, 4 వేలకు పైగా దస్త్రాలను సేకరించిందని గుర్తుచేసింది.
Chandrababu Judicial Remand Extended: చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ఈ నెల 24 వరకు పొడిగింపు
నిధుల దుర్వినియోగం వ్యవహారం అస్పష్టమైనదని, దాన్ని తేల్చేందుకు అత్యంత నిపుణులతో కూడిన దర్యాప్తు అవసరం అని పేర్కొంది. దర్యాప్తు చివరి దశలో ఉన్న ఈ సమయంలో ఎఫ్‌ఐఆర్‌లోను, జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లోను జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధుల వినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, దాని ఆధారంగా విజయవాడ అనిశా కోర్టు ఈనెల 10వ తేదీన జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈనెల 19వ తేదీన జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్‌సాల్వే, సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, రంజిత్‌కుమార్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తమ వాదనలను వినిపించారు. అనంతరం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. తాజాగా నిర్ణయాన్ని వెల్లడిస్తూ పిటిషన్‌ను కొట్టేశారు.
Chandrababu Quash Petition Dismissed: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
సదుద్దేశంతో నిజాయతీగా అధికార విధులు నిర్వహించిన ప్రజా సేవకుడికి రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో శాసనకర్తలు అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17A ను 2018 జులై 26న తీసుకొచ్చారని న్యాయమూర్తి పేర్కొన్నారు. పబ్లిక్ సర్వెంట్ చర్యలు నేరపూరితమైనవిగా కనిపిస్తున్నప్పుడు దర్యాప్తు చేయాలంటే కాంపిటెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తప్పుడు దస్త్రాలు సృష్టించడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది ప్రజాసేవకుడి అధికారిక విధుల్లో భాగం కాదన్నారు.
అలాంటి చర్యలను అధికారిక విధుల్లో భాగంగా పరిగణించలేమన్నారు. కొన్ని దస్త్రాల ఆధారంగా నిధులను విడుదల చేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం, లేదా సిఫారసు చేయడం ద్వారా నిధుల దుర్వినియోగానికి పాల్పడటాన్ని అధికారిక విధుల్లో భాగంగా చెప్పలేమని అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై దర్యాప్తు చేసేందుకు కాంపిటెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు.