Chandrababu Case in High Court : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సీఐడీ కోరడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సీఐడీ (CID) విజ్ఞప్తి మేరకు విచారణకు ఒక్కరోజు ముందు వరకు కౌంటర్ దాఖలుకు సమయమిచ్చింది. ఈ నెల 18 లోగా కౌంటర్ వేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఏసీబీ కోర్టు (ACB Court)లో సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ (Custody Petition) ను ఈ నెల 18 వరకు విచారించవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని.. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు సీఐడీ పిటిషన్‌పై ఎలాంటి విచారణ జరపవద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
LIVE UPDATES: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసు పిటిషన్‌పై విచారణ సైతం ఈ నెల 19కి వాయిదా పడింది. సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు (Chandrababu) తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరింది. రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైకోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేష్‌రెడ్డి ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరపనుండగా.. కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరింది.
ఏపీ రాజధాని నగరానికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల అలైన్‌మెంట్ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (MLA Alla Ramakrishna Reddy)2022 ఏప్రిల్ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని మొదటి నిందితుడిగా సీఐడీ పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబునాయుడు పిటిషన్ వేశారు.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి మాస్టర్ ప్లాన్ (Amaravati Master Plan)ను పట్టించుకోలేదన్నారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు (Inner Ring Road) కోసం గతంలో అంగుళం భూమి సేకరించలేదని చెప్తూ.. అలాంటప్పుడు అనుచిత లబ్ధి పొందడం, ఇతరులకు నష్టం జరగడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న తనపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. ప్రతీకార ఎజెండాతో ముఖ్యమంత్రి.. రాజకీయ ప్రత్యర్ధులపై తప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయించి వేధిస్తున్నారన్నారు. 2022 మే 9న సీఐడీ కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు తనకు నోటీసు ఇవ్వడం, లేదా విచారించడం చేయలేదన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించే క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందన్నారు. ఇదే కేసులో ఇతర నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిలు ఇస్తూ 2022 సెప్టెంబరు 6న ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు చేయాలని కోరారు.