AP CID Enquired Margadarsi MD Sailaja: మార్గదర్శి చిట్‌ఫండ్‌పై నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా.. సంస్థ ఎండీ శైలజా కిరణ్‌ను ఏపీ సీఐడీ అధికారులు గురువారం విచారించారు. గత సోమవారం సంస్థ ఛైర్మన్ రామోజీరావును విచారించిన సీఐడీ అధికారులు.. తాజాగా ఎండీ శైలజా కిరణ్‌ను విచారించారు. విచారణ కోసం పది రోజుల క్రితం.. సీఐడీ అధికారులు నోటీసు ఇవ్వగా గురువారం హాజరయ్యేందుకు.. ఆమె సమ్మతి తెలిపారు.
దాదాపు 7గంటల పాటు సాగిన విచారణ: ఏపీ సీఐడీ విభాగం ఎస్పీ అమిత్ బర్దార్, ఎస్పీ రత్న, అదనపు ఎస్పీ రవివర్మ, దర్యాప్తు అధికారి రవికుమార్ నేతృత్వంలోని 20 మంది గురువారం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు.. విచారణ నిర్వహించి, ఆమె వాంగ్మూలం.. నమోదు చేశారు. విచారణ మొత్తాన్ని వీడియో తీశారు. సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు శైలజా కిరణ్ సమాధానాలిచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్ చట్టప్రకారమే వ్యాపారాన్ని నిర్వహిస్తోందని, ఎలాంటి ఉల్లంఘనలూ జరగలేదని చెప్పారు. మార్గదర్శి వ్యాపారంలో వచ్చిన లాభాలను మాత్రమే.. పెట్టుబడులుగా వినియోగించినట్లు వివరించారు. విచారణ అనంతరం వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు అధికారులు.. సుమారు 3 గంటల సమయం తీసుకున్నారు. రాత్రి ఎనిమిదిన్నరకు సీఐడీ బృందం ఆమె నివాసం నుంచి వెనుదిరిగింది.
మరికొంత సమాచారం సేకరించాలి: ఈ రోజు సుదీర్ఘంగా, సమగ్రంగా విచారణ జరిగిందని ఏపీ సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్ చెప్పారు. మార్గదర్శి ఎండీ ఇచ్చిన వాంగ్మూలాన్ని విశ్లేషించాలని, కేసులో మరికొంత సమాచారం సేకరించాల్సి ఉందని తెలిపారు. అందుకే ఈ నెల 13న మరోసారి విచారిస్తామని, ఈసారి విచారణ అమరావతిలో ఉండే అవకాశం ఉంటుందని ఎండీకి సమాచారం ఇచ్చామన్నారు. ఈ కేసులో అవసరమైతే రామోజీరావుకు మరోసారి సమాచారమిచ్చి, విచారిస్తామని ఎస్పీ చెప్పారు. ఒకవేళ నోటీసు ఇస్తే ఈసారి ఆయనను కూడా అమరావతిలోనే విచారించే అవకాశం ఉందన్నారు.
"సుదీర్ఘంగా, సమగ్రంగా విచారణ జరిగింది. మార్గదర్శి ఎండీ ఇచ్చిన వాంగ్మూలాన్ని మేము విశ్లేషించాలి. ఈనెల 13న విచారణ కొనసాగుతుందని దర్యాప్తు అధికారి శైలజకు సమాచారం ఇచ్చారు. వచ్చే విచారణ అమరావతిలో ఉండే అవకాశం ఉంటుందని ఆమెకు సమాచారం ఇచ్చాం. మరోసారి విచారణ అవసరమైతే రామోజీరావుకు సమాచారం ఇస్తాం. ఈసారి ఆయన విచారణ కూడా అమరావతిలోనే జరిగే అవకాశం ఉంది"-అమిత్ బర్దార్,ఏపీ సీఐడీ ఎస్పీ
ఇవీ చదవండి: