AP CID Chief Sanjay on Skill Development Case : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంతిమ లబ్ధిదారుడని తేల్చేందుకు ఇంకా పూర్తి ఆధారాలు లేవని ఏపీ సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ అంగీకరించారు. ప్రాథమిక ఆధారాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంజయ్ సీమెన్స్ కంపెనీ (Siemens Company) నోడల్ ఆఫీసర్ 164 స్టేట్‌మెంట్‌లో ఏం చెప్పారో కూడా బయట పెట్టేశారు. మొత్తం మీద అడుగడుగునా తడబాటు సమాధానాల దాటవేత భిన్నమైన వివరణలతో ప్రెస్ మీట్ అంతా గందరగోళంగా సాగింది.
AP CID Chief Sanjay Press Meet About chandrababu arrest in Hyderabad : పదేపదే అదే పాటపాడుతూ స్కిల్ డెవలప్మెంట్ (Skill Development)వ్యవహారాన్ని భూతద్దంలో చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సీఐడీ ఈసారి హైదరాబాద్‌ను వేదికగా చేసుకుంది. కొత్త విషయం ఏమీ లేకపోయినా, కొత్తగా మరేదో చెప్పాలని ప్రయత్నించిన సీఐడీ అదనపు డీజీ సంజయ్ అసలు విషయం అడిగేసరికి నీళ్లు నమిలారు. చంద్రబాబే అంతిమ లబ్ధిదారుడని నిర్ధరించడానికి ఇంకా పటిష్టమైన ఆధారాలు దొరకలేదని అన్నారు. అంతిమ లబ్ధిదారు ఎవరన్నది తనకు తెలియదని చేతులెత్తేశారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ప్రకారం చంద్రబాబే అంతిమ లబ్ధిదారు అనడానికి ప్రాథమిక ఆధారాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. భవిష్యత్తులో జరిగే దర్యాప్తులో పటిష్టమైన ఆధారాలు దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంజయ్, అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డిలు కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం ఆద్యంతం.. ఇలానే అయోమయం, అనవసర వివరణలతో గందరగోళంగానే సాగింది. CRPC 164 సెక్షన్ కింద సాక్షులు మెజిస్ట్రేట్ ఇచ్చే వాంగ్మూలాలను సాధారణంగా దర్యాప్తు సంస్థలు ఛార్జిషీట్ వేసే వరకు అత్యంత గోప్యంగా ఉంచుతాయి. కానీ దానికి భిన్నంగా సీమెన్స్ నోడల్ అధికారి అమిత్ సెహగల్ ఏం సాక్ష్యం చెప్పారో కూడా మీడియాకు చెప్పేశారు.
వాంగ్మూలాలు ఎలా బయట పెడతారని అడగ్గా.. తాను స్టేట్మెంట్ చూపలేదని.. ఆయన ఏం చెప్పారో కోట్ చేశానంటూ నీళ్లు నమిలారు. ప్రేంచందర్ రెడ్డి ప్రమేయంపై విలేకరులు అడగ్గా.. ఆయన వచ్చే వరకు నిధులు వెళ్లాయని.. గందరగోళంగా వివరణ ఇవ్వడంతో విలేకరులతో అసహనం వ్యక్తం చేశారు. రెండు నెలల తర్వాత అడగాల్సిన విషయాలను ఇప్పుడే అడుగుతున్నారంటూ పలు ప్రశ్నలకు సమాధానాలు దాట వేశారు.
దర్యాప్తులో ఉన్న కేసు గురించి పోలీసులతో పాటు ప్రభుత్వ న్యాయవాదులు కలిపి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కేసు దర్యాప్తు వివరాలు పోలీసులు మాత్రమే వెల్లడించే వారు. ఆ సంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి తొలిసారి అదనపు అడ్వొకేట్ జనరల్‌ను రంగంలోకి దిపండం చూస్తే.. రచ్చ చేసేందుకే ప్రాధాన్యమిస్తున్నట్లు అర్థమవుతోంది.