CM Ibrahim resigns: దేశంలో రోజురోజుకూ దిగజారుతూ పాతాళానికి పడిపోతున్న కాంగ్రెస్‌కు మరో దెబ్బ పడింది. కర్ణాటకకు చెందిన కీలక నేత సీఎం ఇబ్రహీం... ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈ మేరకు లేఖ రాశారు. తక్షణమే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు.
పార్టీలో ఉన్న సమస్యలపై గత 12 ఏళ్లుగా తాను అనేక లేఖలు రాశారని ఇబ్రహీం పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరిస్తానని చెప్పినా.. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో వివరించారు. అందుకే పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడతో చర్చించి.. జేడీఎస్‌లో చేరే విషయంపై నిర్ణయం తీసుకుంటానని వివరించారు.
ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్సీగా ఉన్న ఆయన.. ఆ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 'ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా. ఈ మేరకు లేఖను మండలి ఛైర్మన్‌తో పాటు విపక్ష నేత సిద్ధరామయ్యకు పంపించా. సిద్ధరామయ్య నా రాజీనామాను అనుమతించి ఛైర్మన్‌కు అందించాలని కోరుకుంటున్నా. ఒకవేళ నా రాజీనామా ఆమోదిస్తే మండలిలో భాజపాకు మెజారిటీ లభిస్తుంది. అందుకే ఈ నిర్ణయాన్ని వారికే వదిలేశా' అని వివరించారు ఇబ్రహీం.
దేవెగౌడకు సన్నిహితుడైన ఇబ్రహీం.. 2004లో జేడీఎస్ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత బీసీ, మైనార్టీ, దళితుల ఉద్యమమైన అహిందలో పాల్గొన్నారు. 2008లో కాంగ్రెస్‌లో చేరారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సిద్ధరామయ్యతో విభేదాలు, తనకు వస్తుందని అనుకున్న మండలిలో విపక్ష నేత పదవికి బీకే హరిప్రసాద్‌ను ఎంపిక చేయడం వంటి నిర్ణయాలు ఆయన పార్టీ వీడేందుకు కారణమయ్యాయి. మైనారిటీలను ఓటుబ్యాంకుగా చూడటం తప్ప, వారిని పట్టించుకోవడం లేదని పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు.
CWC meeting news
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముందు ఇబ్రహీం రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ జరగనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపైనా సమాలోచనలు జరపనున్నారు.
ఇటీవల విడుదలైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తీవ్రంగా నిరాశపర్చింది. పంజాబ్‌లో అధికారం కోల్పోయింది. యూపీలో రెండు స్థానాలకే పరిమితమై చతికిల పడింది.
ఇదీ చదవండి: ఆప్ జోరుకు కాంగ్రెస్ విలవిల.. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా!