Congress MLA Leave the Shoes: రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ ప్రజాపత్ విచిత్ర శపథం చేశారు. తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించేవరకు పాదరక్షలు ధరించనని ప్రతినబూనారు. అసెంబ్లీలో ఇకపై ఎలాంటి ప్రశ్నలు అడగనని స్పష్టం చేశారు. శపథం చేసినట్టుగానే.. అప్పటివరకు తాను వేసుకున్న పాదరక్షల్ని అసెంబ్లీ బయటే విడిచి వెళ్లిపోయారు మదన్.
శపథం వెనుక కథ ఇది..
మదన్ ప్రజాపత్ పచపద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే. బాడ్మేర్ జిల్లాలోని బాలోతరా నగరాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలన్నది ఆయన ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్. బుధవారం రాజస్థాన్ వార్షిక బడ్జెట్ సందర్భంగా కొత్త జిల్లా ఏర్పాటు ప్రకటనపై కోటి ఆశలతో శాసనసభకు వచ్చారు మదన్.
ఆర్థిక శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్.. 4వ సారి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పన, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టిసారిస్తూ వేర్వేరు వర్గాలను ఆకట్టుకునేలా పథకాలు ప్రకటించారు. కానీ.. కొత్త జిల్లాల ఏర్పాటు ఊసెత్తలేదు. కనీసం జిల్లాల పునర్విభజన కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించలేదు.
బడ్జెట్ ప్రసంగంలో కొత్త జిల్లాల ప్రస్తావన లేకపోవడంపై తీవ్ర మనస్తాపం చెందారు మదన్ ప్రజాపత్. సభ వాయిదా పడిన వెంటనే బయటకు వచ్చి, అసెంబ్లీ బయటే పాదరక్షలు విడిచారు. బాలోతరాను జిల్లాగా చేసేవరకు చెప్పులు, బూట్లు వేసుకోనని.. అసెంబ్లీలో ఎలాంటి ప్రశ్నలు అడగనని శపథం చేశారు. అయితే.. గహ్లోత్ బడ్జెట్ మాత్రం చాలా బాగుందని కితాబిచ్చారు మదన్.
ఇవీ చూడండి: రచయిత నిర్వాకం.. మోసాలు చేసి.. వాటిని కథలుగా రాసి...