ఆస్ట్రేలియన్ కంగారూను అక్రమంగా తరలిస్తుండగా బంగాల్లోని అలిపుర్దౌర్ జిల్లా పక్రిబారి ప్రాంతంలో పట్టుకున్నారు పోలీసులు. జిల్లాలోని కుమార్గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధి బరోబిశా ఔట్‌పోస్ట్ బంగల్-అసోం సరిహద్దులో తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు.
"పక్రిబారి సరిహద్దు ప్రాంతంలో 24 గంటలు తనిఖీలు జరుగుతాయి. ఓ ట్రక్కును తనిఖీ చేయగా అందులో ఒక పెద్ద బోను కనిపించింది. దానిని టార్పాలిన్‌తో కప్పి తరలిస్తున్నారు. అలాంటి బోన్లను సాధారణంగా జంతువులను తరలించటానికి ఉపయోగిస్తారు. ఆ బోనులోంచి ఆస్ట్రేలియన్ కంగారూను స్వాధీనం చేసుకున్నాం. ట్రక్కును సీజ్ చేసి డ్రైవర్‌తో పాటు సహయకుడిని అరెస్ట్ చేశాం. భారత్‌లో కొన్ని జంతు ప్రదర్శనశాలల్లోనే కంగారూలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంగారూను పోలీస్ స్టేషన్లోనే ఉంచాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. రాష్ట్ర అటవీ శాఖకు కంగారూను అప్పగిస్తాం. "
- బాసుదేవ్ సర్కార్, కుమార్గ్రామ్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్
గువాహటి నుంచి హైదరాబాద్‌కు..
ఈ కంగారూను అసోంలోని గువాహటి నుంచి తీసుకొచ్చారని, దానిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో అరెస్టయిన ఇమ్రాన్ షేక్, జాహిద్ షేక్‌ను హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించామన్నారు. దేశంలోనే కంగారూను పట్టుకోవటం ఇదే తొలిసారిగా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రోడ్డుపై ఎద్దులు హల్చల్- బుల్‌ఫైట్ వీడియో వైరల్