ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో నక్సల్స్‌కు, భద్రతా సిబ్బందికి మధ్య శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన జవాన్ల సంఖ్య 23కు చేరింది. శనివారం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. ఆదివారం మరో 18 మంది మృతదేహాలను గుర్తించారు. ఈ మేరకు బీజాపుర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. కొంతమంది గల్లంతు కాగా అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
భద్రతా దళాల నుంచి 20కిపైగా ఆయుధాలను నక్సల్స్ లూటీ చేసినట్లు సీఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రపతి విచారం..
ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. అమర జవాన్ల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
మోదీ, షా నివాళులు
ఎన్కౌంటర్ ఘటన నేపథ్యంలో సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ ఆదివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఆరాతీస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. అమరులైన జవాన్లకు వీరు నివాళి అర్పించారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్‌కు అమిత్ షా ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు.
నక్సల్ ఏరివేతలో భాగంగా కోబ్రా దళాలు, డీఆర్జీ బలగాలు, ఎస్టీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా.. బీజాపుర్ జిల్లా అడవుల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో సుకుమా, బీజాపుర్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో బలగాలకు నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 3 గంటల పాటు కొనసాగిన ఈ ఎదురుకాల్పుల్లో.. నక్సల్స్ వైపు కూడా భారీ ప్రాణనష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.