Andhra Pradesh Train Accident: విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పేద కుటుంబాల్లో చీకట్లు నింపింది. విశాఖ నగరంలో పనులు ముగించుకుని త్వరగా ఇంటికి చేరుకుందామనుకున్న బడుగుల బతుకులు ఛిద్రమయ్యాయి. చిమ్మ చీకట్లో ఏం జరిగిందో తేరుకునే లోపే 14 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించిన రైల్వే సిబ్బంది.. మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. దెబ్బతిన్న బోగీలను తొలగించి 19 గంటల వ్యవధిలోనే ట్రాక్ పునరుద్ధరించారు.
రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరణ: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటనలో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు ముమ్మరంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి నుంచి నిరంతరాయంగా శ్రమించిన సహాయక బృందాలు... ఒకదానిపైకి ఒకటి పడిపోయిన రెండు రైళ్ల బోగీలను పక్కకు తొలగించాయి. విశాఖ నుంచి తరలించిన బాహుబలి క్రేన్‌తో బోగీలను ట్రాక్ పైనుంచి పక్కకు జరిపారు. బోగీల్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీయడంతోపాటు.... తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించారు. దెబ్బతిన్న బోగీలను తరలించి... రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించడంతో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి.
AP Train Accident Viral Video: విజయనగరం రైలు ప్రమాద దృశ్యాలు.. చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు బోగీలు..
మృతుల వివరాలను వెల్లడించిన రైల్వే శాఖ: విజయనగరం జిల్లా కంటకాపల్లె- ఆలమండ స్టేషన్ల మధ్య సిగ్నల్ కోసం వేచి ఉన్న పలాస ప్యాసింజర్‌ను విశాఖ- రాయగడ్ ప్యాసింజర్ వెనక నుంచి ఢీకొనడంతో రెండు రైళ్ల బోగీలు పక్కనే ఉన్న గూడ్స్ రైలుపై పడిపోయాయి. మొత్తం 7 బోగీలు నుజ్జునుజ్జవ్వడంతో... అందులో చిక్కుకున్న ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిధ్రమయ్యాయి. చిమ్మచీకట్లో ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. చనిపోయిన వారు, గాయపడిన వారి రక్తం, శరీర భాగాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.
ఈ ప్రమాదంలో విశాఖ- రాయగడ రైలు ఇంజిన్‌లో ఉన్న ఇద్దరు లోకో పైలెట్లు మృతి చెందగా... పలాస ప్యాసింజర్ గార్డు శ్రీనివాస్ చనిపోయారు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన గ్యాంగ్‌మెన్ కృష్ణంనాయుడు, గొడికొమ్ముకు చెందిన కంచుబరకి రవి, కాపుసంబానికి చెందిన అప్పలనాయుడు, పిల్లా నాగరాజు, చల్లా సతీశ్ మృతి చెందారు. గుడబవలసకు చెందిన మజ్జి రాము, రెడ్డిపేటకు చెందిన సీతంనాయుడుతోపాటు శ్రీకాకుళం జిల్లా రామచంద్రాపురానికి చెందిన గిరిజాల లక్ష్మి, మెట్టవలసకు చెందిన టెంకాల సుగుణమ్మ కన్నుమూశారు.
10 లక్షల రూపాయల పరిహారం: రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారాన్ని రైల్వేశాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందించనుంది. మృతుల కుటుంబాలకు ప్రధాని 2 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50వేలు ఇవ్వనున్నారు.