మాటల తూటాలు.. ఎన్నికల వ్యూహాలు.. ఎత్తుకు పైఎత్తులు.. ఇది ప్రస్తుతం బంగాల్ రాజకీయ చదరంగం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్, భాజపా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బంగాల్ ప్రజలు ఇచ్చిన ఉత్సాహంతో ఏకంగా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని భాజపా ఊవిళ్లూరుతోంది. ఇందుకోసం కొత్త ఏడాది జనవరి నుంచి 'భాజపా చాణక్యుడు' అమిత్ షా బంగాల్లో విస్తృతంగా పర్యటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
నెలకు ఓసారి..
2021 ఫిబ్రవరి నుంచి ప్రతి నెలలో ఓ వారం పాటు అమిత్ షా బంగాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో అమిత్ షా ఈ మేరకు వారికి వెల్లడించినట్లు సమాచారం.
2021 జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అమిత్ షా.. బంగాల్లో పర్యటించే అవకాశం ఉంది. లేకుంటే జనవరి 23 సుభాశ్ చంద్రబోస్ జయంతి రోజున అమిత్ షా వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
షా ఎందుకంటే..?
ఇటీవల భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్లదాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేంద్ర హోంశాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఇందుకోసమే అమిత్ షాను రంగంలోకి దింపాలని భాజపా అధినాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమిత్ షా పర్యటన.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఫిబ్రవరి నుంచి ప్రతి నెలలో ఓ వారంపాటు అమిత్ షా బంగాల్లో పర్యటిస్తానని చెప్పారు. ఆయన పర్యటన పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.
- బంగాల్ భాజపా సీనియర్ నేత
200 లక్ష్యం..
294 అసెంబ్లీ స్థానాల్లో 200 చోట్ల గెలవాలని అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. టీఎమ్సీ కోసం ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తోన్న ప్రశాంత్ కిశోర్ భాజపాకు ఇటీవల పలు సవాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో బంగాల్లో అమిత్ షా పర్యటన ఎన్నికల వేడిని మరో స్థాయికి తీసుకువెళ్లేలా కనిపిస్తోంది.
- ఇదీ చూడండి: 200 రాకపోతే తప్పుకుంటారా?: ప్రశాంత్ సవాల్