పెగసస్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై పార్లమెంట్లో దుమారం కొనసాగుతోంది. సోమవారం కూడా ఉభయసభల్లో కార్యకలాపాలు సాగిన పరిస్థితులు కనిపించలేదు. విపక్షాల ఆందోళనలతో సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి.
లోక్‌సభలో..
లోక్‌సభ ప్రారంభం కాగానే.. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారికి సభ ఘన నివాళి అర్పించింది. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించగానే.. పెగసస్ సహా పలు అంశాలపై చర్చ చేపట్టాలంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. మొదట 10 నిమిషాల పాటు లోక్‌సభను వాయిదా వేశారు.
ఆ తర్వాత మళ్లీ సమావేశమైనా పరిస్థితిలో మార్పు లేకపోవటం వల్ల.. మధ్యాహ్నం 12:30 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పటికీ... విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్.. వెనక్కి వెళ్లాలని ఎంత చెప్పినా వినిపించుకోలేదు.
బిల్లులకు ఆమోదం..
విపక్షాల ఆందోళనల మధ్యే.. సభ ముందుకు ఆరు బిల్లులను తీసుకొచ్చింది కేంద్రం. అందులో మూడు ఆమోదం పొందాయి. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (సవరణ) బిల్లు 2021, ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(సవరణ) బిల్లు 2021కు ఆమోదం తెలిపింది లోక్‌సభ. ఈ బిల్లులు అంతకు ముందే రాజ్యసభలో ఆమోదం పొందాయి. అలాగే.. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు 2021కి ఆమోదం లభించింది.
రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్ర లోక్‌సభలో ప్రవేశపెట్టిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ప్రకటించాయి ప్రతిపక్షాలు. ముందుగా సభ నుంచి వాకౌట్ చేసినప్పటికీ తిరిగి వచ్చి తమ స్థానాల్లో కూర్చుకున్నారు సభ్యులు. ఈ బిల్లుపై ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా చర్చలో పాల్గొంటామని స్పష్టం చేశాయి.
అనంతరం సభను మధ్యహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. అయితే.. కొవిడ్-19పై చర్చ చేపట్టేందుకు సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లాలని సభాపతి స్థానంలో ఉన్న రమాదేవి కోరారు. అయినప్పటికీ వెనక్కి తగ్గక పోవటం వల్ల సభను మంగళవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలో..
రాజ్యసభ ప్రారంభం కాగానే క్విట్ ఇండియా పోరాటవీరులకు నివాళి అర్పించింది రాజ్యసభ. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలిపింది. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్డా జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించటంపై దేశం గర్విస్తోందని ఛైర్మన్ వెంకయ్య నాయుడు కొనియాడారు. మరికొందరు తమ ఆటతీరుతో దేశ ప్రజల మనసులు గెలుచుకున్నారని ప్రశంసించారు. 121 ఏళ్ల దేశ క్రీడల ప్రయాణంలో టోక్యో ఒలింపిక్స్ అత్యుత్తమమని పేర్కొన్నారు.
ఆ తర్వాత వెంకయ్య నాయుడు ప్రశ్నోత్తరాలు చేపట్టగానే.. విపక్ష సభ్యులు లేచి పెగసస్ సహా పలు అంశాలపై చర్చించాలంటూ నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాల ఆందోళనలు కొనసాగటం వల్ల సభను మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేశారు.
తిరిగి ప్రారంభమైన తర్వాత.. పన్ను చట్టాల(సవరణ) బిల్లు-2021ను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే. బిల్లు తీసుకొచ్చే కొద్ది గంటల ముందే సభ్యులకు అందించటం వల్ల చర్చ సందర్భంలో సరైన న్యాయం చేయలేరని పేర్కొన్నారు. అలాంటి తప్పుడు పనులకు తాము మద్దతు ఇవ్వబోమని, సభ నుంచి వాకౌట్ చేశారు. సప్లిమెంటరీ ఎజెండాను తీసుకురావటం ఇదే తొలిసారి కాదని సమాధానమిచ్చారు అధికార పక్ష నేత పీయూష్ గోయల్. పన్ను చట్టాల సవరణ బిల్లు, కేంద్ర విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును జాతీయ ప్రాధాన్యంతో తీసుకొచ్చినట్లు చెప్పారు.
కీలక బిల్లులకు ఆమోదం..
ఆ తర్వాత.. పన్ను చట్టాలు(సవరణ) బిల్లు- 2021, కేంద్ర విశ్వవిద్యాలయాలు(సవరణ) బిల్లు 2021కి ఆమోదం తెలిపింది రాజ్యసభ. అలాగే.. ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రైబ్యునల్(ఎఫ్‌సీఏటీ) సహా మొత్తం 9 అప్పిలేట్ ట్రైబ్యునల్స్‌ను రద్దు చేసేందుకు తీసుకొచ్చిన ట్రైబ్యునల్ సవరణ బిల్లు-2021కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు.. ఆగస్టు 3వ తేదీనే లోక్‌సభలో ఆమోదం లభించింది.
అనంతరం రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది.
ఇదీ చూడండి: ఓబీసీ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు