Sanjay Raut ED case: మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని సూచించింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఈడీ విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రూ.1,043 కోట్లు విలువైన పాత్రచాల్ భూకుంభకోణంలో సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లు విలువ చేసే ఆస్తులను ఏప్రిల్‌లో ఈడీ జప్తు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే మరోమారు సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్.
ఈడీ చర్యలను సంజయ్ రౌత్ తప్పుబట్టారు. సమన్లు జారీ చేయడాన్ని 'కుట్ర'గా అభివర్ణించారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు మాదిరిగా తాను గువాహటికి వెళ్లనని అన్నారు. బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయితే.. అలీబాగ్‌లో ఒక సమావేశానికి మంగళవారం హాజరు కావాల్సి ఉన్నందున.. ఈడీ ముందు హాజరు కాలేనని సంజయ్ రౌత్ తెలిపారు. తర్వాత వచ్చేందుకు అవకాశమివ్వాలని ఈడీని కోరతానని చెప్పారు. ఆలస్యమైనా విచారణకు మాత్రం తప్పక హాజరవుతానని స్పష్టం చేశారు.
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ తనపై చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు సంజయ్ రౌత్. ఈడీ వెంట భారతీయ జనతా పార్టీ ఉందని విమర్శించారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని తమపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రతీకారం కోసం ఈ రోజు తనపై చర్యలు తీసుకుంటున్నారని.. భవిష్యత్‌లో భాజపా నేతలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు సంజయ్ రౌత్.
ఇవీ చదవండి: 'ఆ ఎమ్మెల్యేలు రూ.50 కోట్లకు అమ్ముడుపోయారు.. మొత్తం స్క్రిప్ట్ భాజపాదే'