కొవిడ్‌పై పోరులో ముందుండి పోరాడుతున్న వారికే మొదటి దశలో టీకా అందిస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. టీకాను ఐసీఎంఆర్ ఆమోదించిన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీసుకోనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 1.25 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా అందించనున్నారు. పంజాబ్‌లో కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధత అంశాలపై వర్చువల్‌గా జరిగిన కేబినెట్ భేటీలో అమరీందర్ సింగ్ పాల్గొన్నారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే మరో 70 లక్షల (రాష్ట్ర జనాభాలో 23 శాతం)మందికి మొదట టీకా అందించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర వ్యూహానికి తగ్గట్టుగా పంజాబ్ ఈ విధానాన్ని అమలు చేయనుంది. టీకా పంపిణీలో అవాంతరాలు లేకుండా ఉండటానికి, జాతీయ స్టీరింగ్ కమిటీతో ఆ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమన్వయంతో వ్యవహరిస్తోంది. అదే విధంగా బ్లాక్ లెవల్, జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీలతో కలిసి రాష్ట్ర టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది.
వ్యాక్సిన్‌ను భద్రపరిచేందుకు కావాల్సిన డీప్ ఫ్రీజర్లు, టీకా వ్యాన్లు, కోల్డ్ బాక్స్‌లు అందించాలని కేంద్రాన్ని పంజాబ్ సర్కార్ కోరింది.
ఇదీ చూడండి:ఆ సీఎంలకు మోదీ ఫోన్- 'బురేవి'పై ఆరా