Aluva Girl Missing Case : కేరళలోని అలువాలో ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడి కర్కశంగా గొంతుకోసి హతమార్చిన ఉదంతం స్థానికుల హృదయాలను కలచివేస్తోంది. బాలికను కాపాడలేకపోయిన పోలీసులు.. చిన్నారికి క్షమాపణలు చెప్పారు. చిన్నారిని తల్లిదండ్రులతో కలపలేక పోయినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. 'క్షమాపణలు తల్లి' అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు పోలీసులు.
Aluva Child Death : మరోవైపు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రభుత్వాన్ని కోరారు. చిన్నారిని చంపేసిన నిందితుడు మనిషిగా పిలిచేందుకు అర్హుడు కాదన్నారు. అంత్యక్రియల ముందు బాలిక మృతదేహాన్ని కొచ్చిలో ఆమె చదువుకున్న పాఠశాలలో ఉంచారు. స్థానికులు, రాజకీయ నాయకులు చిన్నారికి నివాళి అర్పించారు. నిందితుడు అస్ఫాక్ ఆలాంకు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నిందితుడికి జైళ్లో అన్నం పెట్టి మేపడం దండగనీ.. చిన్నారిని ఎలా చంపాడో అలానే అతడిని చంపాలని నినదించారు. అనంతరం బాలిక మృతదేహానికి వేలాదిమంది సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి.
Aluva Child Abduction : బాలిక కుటుంబం బిహార్ నుంచి వలస వచ్చి కేరళలోని అలువాలో ఉపాధి చేస్తూ జీవనం సాగిస్తోంది. శుక్రవారం చిన్నారి ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న అస్ఫాక్ ఆలాం అనే వ్యక్తి బాలికను కిడ్నాప్ చేశారు. అనంతరం బాలిక ఏడవకుండా ఉండేందుకు చాక్లెట్ కొనిచ్చినట్లు తెలిసింది. చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్తుండగా అనుమానం వచ్చిన ఓ స్థానికుడు ఎవరని అడగ్గా.. తన బిడ్డ అని అస్ఫాక్ చెప్పాడు. పాప కిడ్నాప్ అయినట్లు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు అందింది.
సీసీటీవీ ఆధారంగా రాత్రి తొమ్మిదిన్నర గంటలకు అస్‌ఫాక్‌ను పోలీసులు పట్టుకున్నారు. అస్ఫాక్ మద్యం మత్తులో ఉండటం వల్ల సమాధానం రాబట్టలేకపోయారు. శనివారం తమదైన శైలిలో పోలీసులు విచారించగా నిందితుడు నిజం కక్కాడు. నిర్మానుష్య ప్రాంతంలో బాలిక మృతదేహం గోనెసంచిలో చుట్టుపడేసిన ప్రదేశాన్ని చూపించాడు. మృతదేహం కనిపించకుండా చెత్తతో కప్పాడు. శుక్రవారం 5 గంటల సమయంలో అస్‌ఫాక్ బాలికపై అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు తేల్చారు.