జమ్ము వైమానిక స్థావరంపై జరిగిన దాడిని మరువక ముందే మరో రెండు డ్రోన్లు పాక్ నుంచి భారత్ వైపునకు దూసుకొచ్చాయి. వాయుసేన స్థావరంపై దాడి జరిగిన 24 గంటల్లోనే మరో సైనిక స్థావరం వద్ద డ్రోన్ల సంచారం ఆందోళనకరంగా మారింది.
జమ్ములోని కల్చుక్ మిలిటరీ స్టేషన్‌లో ఆదివారం అర్ధరాత్రి డ్రోన్లు కనిపించాయి. రాత్రి 11గంటల 45 నిమిషాలకు ఓ డ్రోన్ ఆర్మీ బేస్‌పై ఎగురుతూ కనిపించగా.. మరొకటి అర్ధరాత్రి దాటిన తర్వాత 2గంటల 40నిమిషాలకు కనిపించింది. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ జవాన్లు వాటిపై 25 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అవి వెంటనే పాక్ వైపునకు వేగంగా వెళ్లిపోయాయి.
భద్రతా బలగాలు కట్టుదిట్టమైన పహారా కారణంగా మరోమారు డ్రోన్ దాడి జరగకుండా సైన్యం నిలువరించగల్గిందని లెఫ్టినెంట్ కర్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. డ్రోన్ల సంచారం నేపథ్యంలో మిలిటరీ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించిన సైన్యం.. ఆయా ప్రదేశాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని సైన్యం తెలిపింది.
2002లో కల్చుక్ మిలటరీ స్టేషన్‌పై అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 32 మంది మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి సైన్యం ఇక్కడ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
ఇదీ చదవండి: IAF:నివురుగప్పిన ముప్పు ముంగిట్లో భారత్!