Indian evacuation from Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టిన క్రమంలో ఆ దేశంలో వేలాది మంది భారత పౌరులు, విద్యార్థులు చిక్కుకుపోయారు. సుమారు 20వేల మంది ఉంటారని అంచనా వేసింది ప్రభుత్వం. వారంతా బాంబుల మోతల మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమను స్వదేశానికి తీసుకెళ్లాలని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఉక్రెయిన్‌లోని భారతీయుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని ప్రకటించిన కేంద్రం.. ఆ దిశగా చర్యలు చేపట్టింది. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
సరిహద్దు దేశాలకు ప్రత్యేక విమానాలు..
ఉక్రెయిన్‌లో దాడుల నేపథ్యంలో ఆదేశంలోకి విమానాలు వెళ్లలేని పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో భారత పౌరుల కోసం ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన రొమేనియాకు రెండు ప్రత్యేక విమానాలు పంపించి.. అక్కడి నుంచి తరలించించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. రొమేనియా రాజధాని బుచారెస్ట్కు శుక్రవారం రెండు ఎయిర్ఇండియా విమానాలు వెళ్తున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు రోడ్డు మార్గం ద్వారా చేరిన పౌరులను.. అక్కడి భారత అధికారులు బుచారెస్ట్కు తరలిస్తారని చెప్పారు. ఆ తర్వాత విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొస్తారని వెల్లడించారు. అక్కడి నుంచి శనివారం రెండు విమానాలు భారత్‌కు తిరిగి బయలుదేరతాయని చెప్పారు. అయితే.. ఈ విషయంపై ఎయిర్ఇండియా నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
మరోవైపు.. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌కు శనివారం ఓ విమానం వెళ్లనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విమానాల ఖర్చును ప్రభుత్వే భరించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
భారతీయులకు అడ్వైజరీ
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత పౌరులు, విద్యార్థులకు అడ్వైజరీ జారీ చేసింది అక్కడి భారత రాయబార కార్యాలయం. రొమేనియా, హంగేరీ మీదుగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఆయా సరిహద్దుల చెక్పాయింట్ల వద్ద భారత బృందాలు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అప్రమత్తంగా, భద్రంగా, ధృడంగా ఉండాలని సూచించింది. విదేశాంగ శాఖ బృందాల సమన్వయంతో సరిహ్దదులు దాటాలని స్పష్టం చేసింది. తమతో పాస్‌పోర్టులు, నగదు సహా ఇతర అత్యవసర వస్తువులను తీసుకెళ్లాలని సూచించింది. అందుబాటులో ఉంటే కొవిడ్-19 వ్యాక్సినేషన్ ధ్రువపత్రం తీసుకెళ్లాలని కోరింది.
ప్రధానికి ఐఎంఏ విజ్ఞప్తి..
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వైద్య విద్యార్థులను తరలించేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరింది భారత వైద్య సంఘం(ఐఎంఏ). రష్యా మిలిటరీ ఆపరేషన్‌తో పెరిగే విమాన ఛార్జీలను చాలా మంది విద్యార్థులు భరించే పరిస్థితులు లేవని పేర్కొంది. వారికి ఆర్థికంగా సాయం అందించాలని, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని కోరింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్లు గుర్తు చేసింది.
ఇదీ చూడండి: 'ఉక్రెయిన్‌లోని భారతీయుల భద్రతకే అధిక ప్రాధాన్యం'