బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ను వీడి.. భాజపాలో చేరిన నేతలు కొందరు సొంతగూటికి చేరాలని చూస్తున్నారు.
ఇప్పటికే టీఎంసీలో చేరుతానని ప్రాధేయపడుతూ మమతకు మాజీ ఎమ్మెల్యే సోనాలీ గుహ లేఖ రాయగా.. ఇప్పుడు అదే బాటలో పయనించారు సరళా ముర్ము. ఎన్నికల్లో తనకు కేటాయించిన స్థానం పట్ల అసంతృప్తితో పార్టీ మారిన ముర్ము.. తనను క్షమించాలని దీదీని కోరారు. భాజపాలో చేరి తప్పు చేశానని, మళ్లీ ఇప్పుడు టీఎంసీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశమివ్వాలని అభ్యర్థించారు.
'' నన్ను చేర్చుకోవడానికి అంగీకరిస్తే.. నేను ఆమె వెంటే ఉంటా. పార్టీ కోసం శ్రద్ధగా పనిచేస్తా. నేను నిజంగా తప్పుచేశాను. అందుకు నన్ను మమతా బెనర్జీ క్షమించాలి.''
- సరళా ముర్ము, భాజపా నేత
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముర్ముకు మాల్దాలోని హబీబ్పుర్ స్థానం కేటాయించింది టీఎంసీ. కానీ.. మాల్దా నుంచే పోటీ చేయాలనుకున్న ఆమె అసంతృప్తితో పార్టీని వీడారు.
దీదీ లేకుంటే బతకలేనని, తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని మమతా బెనర్జీకి శనివారం లేఖ రాశారు గుహ. మరుసటి రోజే ముర్ము ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్.. భారీ విజయం సాధించింది. 294 స్థానాలకు గానూ .. టీఎంసీ 213 చోట్ల గెలుపొందింది. భాజపా 77 స్థానాలకే పరిమితమైంది. ఈ విజయం అనంతరం.. భాజపాలో చేరిన పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు తిరిగి సొంత పార్టీలోకి చేరాలని ఊవిళ్లూరుతున్నారు.
ఇదీ చూడండి: కొవిడ్ రోగుల కోసం 104 ఏళ్ల సంప్రదాయం మార్పు