Man beaten to death: అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేయబోయాడన్న కారణంతో ఓ వ్యక్తిని భక్తులు కొట్టి చంపిన 24 గంటల వ్యవధిలో అలాంటిదే మరో ఘటన జరిగింది. పంజాబ్ కపుర్తలాలోని నిజాంపుర్లో.. ఓ వ్యక్తిపై ప్రజలు దాడి చేయగా అతడు ప్రాణాలు కోల్పోయాడు.
Man disrespected the Nishan Sahib: ఆ వ్యక్తి సిక్కుల జెండాను (నిషాన్ సాహిబ్) అగౌరవపరిచి, పారిపోతుండగా దాడి చేసినట్లు ప్రజలు చెబుతున్నారు.
స్థానికులు అతడిని కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
స్వర్ణ దేవాలయంలో..
స్వర్ణ మందిరంలోకి శనివారం ఓ ఆగంతుకుడు చొరబడ్డాడు. మందిరంలోని గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్వర్ణ మందిరం భద్రతా సిబ్బంది ఆగంతుకుడిని అడ్డుకున్నారు. గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు యత్నించగా.. అక్కడే ఉన్న భక్తులు అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతునిపై కేసు నమోదు..
స్వర్ణ దేవాలయంలోకి చొరబడ్డ ఆ వ్యక్తి వివరాలను తెలుసుకొనేందుకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను మొత్తం క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఆలయం ఆవరణలో అతడు కొన్ని గంటలు గడిపినట్లు పోలీసులు నిర్ధరించారు.
శనివారం ఉదయం 11 గంటలకు ఆలయంలోకి వచ్చిన ఆగంతుకుడు.. అకాల్ తఖ్త్ ఎదుట కొన్ని గంటలు నిద్రించినట్లు పోలీసులు గుర్తించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిందితుడు గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించినట్లు వివరించారు. అతడి వద్ద ఫోన్, పర్స్, గుర్తింపు కార్డుల్లాంటివి ఏమీ లేవని వెల్లడించారు.
మరణించిన నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 295ఏ(ఉద్దేశపూర్వకంగా మతపర విశ్వాసాలను అవమానించడం, ఆగ్రహానికి గురిచేయడం) సహా 307(హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ రంధావా. గురుద్వారా సాహిబ్‌లో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: స్వర్ణదేవాలయంలో ఆగంతుకుడు హల్చల్.. భక్తుల దాడిలో మృతి