నేడు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని.. అధికార సంకీర్ణ కూటమి నేతలు కలవనున్నారు. భాజపా తప్పుడు ఆరోపణల నేపథ్యంలో.. శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ నేతలు కోశ్యారీకి వాస్తవాలను వివరించనున్నట్లు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత నానా పటోలే.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. తమ బృందానికి నేతృత్వం వహించనున్నారని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా గవర్నర్‌ను కలిసే నేతల్లో ఉన్నట్లు స్పష్టం చేశారు.
''సంకీర్ణ కూటమిపై తప్పుడు ఆరోపణల వెనుక దాగిఉన్న నిజాలను గవర్నర్‌ను ముందు ఉంచనున్నాం.''
- నానా పటోలే, కాంగ్రెస్ సీనియర్ నేత
అధికార ప్రభుత్వం గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోలేదని.. రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఆయన గురువారం రోజు.. నగరంలో ఉండట్లేదని సమాచారం.
'నివేదిక అందించండి'
బుధవారం.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని భాజపా బృందం గవర్నర్‌ను కలిసింది. రాష్ట్రంలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగేందుకు నైతిక అర్హత కోల్పోయిందని ధ్వజమెత్తారు ఫడణవీస్. సహచర భాజపా నేతలతో కలిసి గవర్నర్‌కు మెమొరాండం సమర్పించారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఠాక్రే నోరు మెదపడం లేదని, అన్ని సమస్యలపై నివేదిక అందించేలా సీఎంను ఆదేశించాలని కోశ్యారీని కోరారు. అవినీతి ఆరోపణలతో పాటు అధికారుల బదిలీ అంశంపైనా దర్యాప్తు జరగాలని ఫడణవీస్ డిమాండ్ చేశారు.
'మాకు 175 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది'
ఫడణవీస్ విమర్శలకు బదులిచ్చిన ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్.. ముఖ్యమంత్రి సరైన సమయంలో మాట్లాడతారని, నిరాధార ఆరోపణలు తగవని అన్నారు. తమ ప్రభుత్వానికి 175 మంది ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉందని, రాష్ట్రపతి పాలన ప్రశ్నే అనవసరమని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: 'నైతిక అర్హత కోల్పోయిన మహా సర్కార్'