దేశంలో కరోనా కేసులు కోటి దాటాయి. శనివారం.. 25,152 కొత్త కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 1,00,04,599కి చేరింది. ఇందులో 95,50,712 మంది ఇప్పటికే కోలుకొని ఇంటికి చేరారు. 1,45,136 మంది కన్నుమూశారు. 3,08,751 మంది ఆసుపత్రులు, ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. అమెరికా తర్వాత కోటి కేసులు భారత్‌లోనే నమోదయ్యాయి.
ఈ ఏడాది జనవరి 30న కేరళలో తొలి కేసుతో ప్రారంభమైన కరోనా ప్రస్థానం ఎత్తుపల్లాలుగా సాగుతోంది. మొత్తం కేసుల్లో 75%, మరణాల్లో 78% కేవలం పది రాష్ట్రాలకే పరిమితం. అత్యధిక ప్రభావం నైరుతి రాష్ట్రాల్లోనే కనిపించింది. దేశంలో కరోనా ఆనవాళ్లు మొదలై ఇప్పటికి 325 రోజులైంది. తాజా లెక్కల ప్రకారం చూస్తే దేశంలో రోజుకు సగటున 30,783 కేసులు.. 446 మరణాలు నమోదయ్యాయి. 29,386 మంది కోలుకొని ఇంటికెళ్లారు. గత 24 గంటల్లో కొవిడ్‌తో 347 మంది మృత్యువాతపడ్డారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య 16 కోట్లకు చేరింది.
నవంబరు నుంచి తిరోగమనం
మార్చి 25 నుంచి దేశంలో లాక్‌డౌన్ మొదలు కావడంతో మొత్తం జనజీవనం స్తంభించిపోయింది. మే 1 నుంచి రైళ్లు, 25 నుంచి విమానాలు, జూన్ 8 నుంచి రోడ్లు తెరచుకోవడంతో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులలో కరోనా ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఆ నెలల్లో నమోదైన కేసులు, మరణాలు దేశాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. అమెరికా, యూరప్ దేశాల్లో మరణమృదంగం వినిపించడంతో భారత్‌లో పరిస్థితులు ఎంతవరకు వెళ్తాయోనన్న భయాందోళనలు ప్రతి ఒక్కరినీ వెంటాడాయి. నవంబరు నుంచి తిరోగమనం మొదలవడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.
ప్రముఖులను కోల్పోయిన దేశం..
ఈ కాలంలోనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యంతో పాటు శాసన, న్యాయ వ్యవస్థలు, కళ, పారిశ్రామిక రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులను దేశం కోల్పోయింది. ఉపరాష్ట్రపతితో సహా ఎంతోమంది కేంద్ర మంత్రులు దీని బారిన పడి కోలుకున్నారు. మరోవైపు ఇదే కరోనా కాలంలో వచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ చట్టాలు మా కొద్దంటూ కరోనాను, చలిని సైతం లెక్కచేయకుండా అన్నదాతలు దిల్లీ సరిహద్దుల్లో నవంబరు 26 నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఇంటి నుంచే పనితోపాటు చదువు..
ఈ 325 రోజుల్లో దేశం ఎన్నో మార్పులను చవి చూసింది. ఇంటి నుంచే పని చేయడంతో పాటు చదువుకోవడాన్ని అలవాటుగా చేసుకుంది. న్యాయస్థానాలు, పార్లమెంటు లాంటి అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలూ తమ పనితీరును గుణాత్మకంగా మార్చుకున్నాయి. అధికారిక సమావేశాలన్నీ వీడియోకాన్ఫరెన్స్‌లోకి మారిపోయాయి. ఈ మధ్యకాలంలోనే కోట్ల మంది వలస కార్మికులు పని చేసే ప్రాంతాలను వదిలి కాలినడకన సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. ఆ క్రమంలో జరిగిన ప్రమాదాల్లో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ ఉత్థానపతనాలకు లోనైంది. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ప్రస్తుతం వైరస్ నియంత్రణలో భారత్ ప్రపంచ దేశాల కంటే పటిష్ఠ స్థితికి చేరింది.
ఇదీ చదవండి:ఔరా! ఈ దివ్యాంగుల చేతులు అద్భుతాల్ని చేశాయి