కర్ణాటకలో పెరోల్‌పై విడుదలై 15 ఏళ్లగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. పెరోల్‌పై విడుదలై తిరిగి రాని కేసులను దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో అతడికి జీవిత ఖైదు శిక్ష పడింది.
అసలేంటీ కేసు..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2000 సంవత్సరంలో బెంగళూరులోని హోసూర్ రోడ్లో.. ఐదుగురు వ్యక్తులు కలిసి ఓ లారీ డ్రైవర్‌ను హత్య చేసి దొంగతనానికి పాల్పడ్డారు. ఆ కేసును దర్యాప్తు చేసిన మడివాలా పోలీసులు సుహైల్, శంకర్, సలీమ్, చాంద్ పాషా, వేణుగోపాల్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. 2004లో కోర్టు వారికి జీవిత ఖైదు శిక్షను విధించింది. మూడేళ్ల శిక్షను అనుభవించిన అనంతరం.. 2007లో సుహైల్ పెరోల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత తిరిగి జైలుకు వెళ్లకుండా మహమ్మద్ అయాజ్గా పేరు మార్చుకొని అజ్ఞాతంలోకి వెళ్లాడు. పోలీసులు కొంతకాలం పాటు వెతికినా సరే సుహైల్ ఆచూకీ దొరకలేదు. దీంతో సుహైల్‌ను వెతకడం ఆపేశారు.
అదే కేసులో శిక్ష పడిన మరో నిందితుడు శంకర్ కూడా 2015లో పెరోల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం 2017లో శంకర్ చనిపోయాడు. అయితే శంకర్ డబ్బుల కోసం దక్షిణ కన్నడ జిల్లాలోని బేళ్తంగడి ప్రాంతంలో ఓ వ్యక్తి వద్దకు వెళ్లేవాడని అతడి స్నేహితుడు పోలీసులకు తెలిపాడు. పోలీసులు అప్పుడు ఆ సమాచారాన్ని సరిగా పట్టించుకోలేదు.
కొన్నిరోజుల క్రితం మడివాలా పోలీసులు పెరోల్‌పై విడుదలై తిరిగి రాని కేసులను దర్యాప్తు చేయడం ప్రారంభించారు. శంకర్ స్నేహితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా చేసుకొని విచారణ చేపట్టి బేళ్తంగడి చేరుకున్నారు. అక్కడ.. ఆయుర్వేదం మందుల దుకాణం నడుపుతున్న సుహైల్ అలియాస్ మహమ్మద్ అయాజ్‌ను గుర్తించారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.