ACB raids Karnataka: అక్రమాస్తుల కేసులో భాగంగా బుధవారం భారీ స్థాయిలో సోదాలు నిర్వహించిన కర్ణాటక ఏసీబీ.. రూ.కోట్ల విలువైన ఆస్తిని సీజ్ చేసింది. 18 మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు చేసింది. కర్ణాటకలోని 75 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. వందమందికి పైగా అధికారులు, 300 మందికి పైగా సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.
Karnataka ACB raids news
లెక్కలోకి రాని నగదు, బంగారం, ఖరీదైన గృహసామగ్రిని అధికారులు గుర్తించారు. పెద్ద ఎత్తున భూమి పత్రాలు, వాణిజ్య సముదాయాలు, వ్యవసాయ భూములను సోదాల్లో భాగంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. విలాసవంతమైన హోమ్ థియేటర్లు, బ్యాడ్మింటన్ కోర్టులు సైతం ఇందులో ఉన్నాయని చెప్పారు.
బాగల్కోటె జిల్లాలోని బదామీ అటవీ రేంజ్ అధికారికి చెందిన ప్రదేశాల నుంచి 3 కిలోల గంధపు దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 'కృష్ణ భాగ్య జలనిగమ్ లిమిటెడ్' అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అశోక్ రెడ్డి పాటిల్ ఇంట్లో నుంచి రూ.7 లక్షల నగదు, భారీగా బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు. మైసూర్ విజయనగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, చామరాజనగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చెలువురాజ ఇళ్లను సోదా చేయగా.. పలు అక్రమ పత్రాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.
ఏసీబీ సోదాలు నిర్వహించిన వారిలో అదనపు కమిషనర్లు, ఇంజినీర్లు, అటవీ శాఖ అధికారులు, మేనేజర్ స్థాయి ఉన్నతాధికారులు సైతం ఉన్నారు.
ఇదీ చదవండి: పుట్టిన బిడ్డను భూమిలో పాతేసిన తల్లి... శిశువు ఏడుపు విని..