కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన తొలి రోజే.. వందే భారత్ రైలులో లీకులు కనిపించడం చర్చనీయాంశమైంది. లీక్ నేపథ్యంలో గమ్యస్థానం కాసర్గోడ్ వెళ్లాల్సిన ఈ సెమీ హైస్పీడ్ రైలు.. కన్నూర్ రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయింది. వెంటనే అధికారులు.. ఏసీ గ్రిల్‌కు మరమ్మతులు చేపట్టారు.
అసలేం జరిగిందంటే?
మంగళవారం ఉదయం మోదీ ప్రారంభించిన తర్వాత.. వందే భారత్ రైలు తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ బయలుదేరింది. మార్గమధ్యలో రైలు ఎగ్జిక్యూటివ్ బోగీలోని ఏసీ గ్రిల్లో వాటర్ లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే కన్నూర్ రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు. ఐసీఎఫ్ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ)కి చెందిన సాంకేతిక నిపుణులు రైలులో తనిఖీలు చేపట్టారు. సమస్యను గుర్తించి మరమ్మతులు చేశారు. ఆ తర్వాత రైలు కాసర్గోడ్ చేరుకుంది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు రైలు.. కాసర్గోడ్ నుంచి తిరిగి తిరువనంతపురం చేరనుంది. ఇలాంటి చిన్న మరమ్మతులు జరగడం సాధారణమనేనని.. కొన్ని రోజుల పాటు తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
అయితే కేరళలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ.. మంగళవారమే వందేభారత్ రైలును ప్రారంభించారు. దాంతో పాటు దేశంలోనే తొలి వాటర్ మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు. మంగళవారం ఉదయం కొచ్చి నుంచి తిరువనంతపురం చేరుకున్న ఆయన.. విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. మార్గమధ్యలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. అనంతరం తిరువనంతపురం రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ఓ కోచ్‌లో చిన్నారులతో ముచ్చటించిన ప్రధాని మోదీ.. వారు తీసుకొచ్చిన పెయింటింగ్స్ చూసి సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని చూసేందుకు పెద్దసంఖ్యలో కేరళ ప్రజలు రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ఇప్పటికే అనేక చోట్ల ప్రమాదాలు కూడా జరిగాయి. గతేడాది నవంబర్‌లో గుజరాత్‌లోని ఆనంద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న ఓ 54 ఏళ్ల మహిళను ముంబయి వెళ్తున్న సెమీ హైస్పీడ్ రైలు ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలు అహ్మదాబాద్‌కు చెందిన బీట్రైస్ ఆర్కిబాల్డ్ పీటర్గా గుర్తించారు. అంతకుముందు.. అక్టోబరు 6న ముంబయి నుంచి గాంధీనగర్‌కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గుజరాత్‌లోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రైలు ముందు ప్యానెల్ పూర్తిగా దెబ్బతింది.