Beef seized: కంటైనర్‌లో గొడ్డు మాంసం(బీఫ్) అక్రమంగా తరలిస్తున్న ముఠాను మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. 21 వేల కిలోల గొడ్డు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.20 లక్షలు ఉంటుందని తెలిపారు.
మహారాష్ట్రలో బీఫ్ విక్రయాలను నిషేధించారు. ఈ క్రమంలోనే తమిళనాడు నుంచి ముంబయి, ఠాణెలకు అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న స్థానిక క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. పాల్ఘర్ జిల్లాలోని ముంబయి-అహ్మదాబాద్ రహదారిపై కాపు కాశారు. అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ కంటైనర్ ఆపి.. తనిఖీ చేశారు. దీనిపై నిందితులను నిలదీయగా.. పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్పటికే వలపన్నిన పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. 21,018 కిలోల గొడ్డు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తమిళనాడుకు చెందిన కే రాజేంద్ర, రంజిత్ కుమార్‌లుగా గుర్తించారు.
ఈ ఘటనపై జిల్లాలోని కాసా పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి