మహారాష్ట్రకు చెందిన ఓ నావికాదళ సైనికుడిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆయన ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. ఇదంతా వారు రూ.10 లక్షల కోసం చేసినట్లు విచారణలో తేలింది.
ఇదీ జరిగింది..
మహారాష్ట్రలోని పాల్గఢ్లో జిల్లాకు చెందిన సూరజ్ కుమార్ మిథిలేశ్ దూబే(27) భారత నావికాదళంలో నావికుడి(సెయిలర్)గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో భాగంగా.. ప్రస్తుతం ఆయన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఐఎన్‌ఎస్ అగ్రాణీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల సెలవుపై వెళ్లిన దూబే.. మళ్లీ విధుల్లో చేరేందుకు జవవరి 31న చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ గుర్తుతెలియని ముగ్గురు దుండగులు దూబేను అపహరించారు. దాదాపు మూడు రోజుల పాటు చెన్నైలోనే గుర్తు తెలియని ప్రాంతంలో ఉంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. అందుకు ఆయన నిరాకరించారని పోలీసులు తెలిపారు.
అనంతరం ఆ దుండగులు దూబేను పాల్గఢ్లోని వెవేజీ గ్రామ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం కాళ్లు, చేతులు కట్టేసి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయారు. మంటల్లో కాలుతూనే దూబే అక్కణ్నుంచి పరుగులు తీశారు. ఇది గమనించిన స్థానికులు.. తక్షణమే స్పందించి దూబేను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే 90 శాతం కాలిన గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ముంబయిలోని నావికాదళ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే కన్నుమూశారు. చనిపోయే ముందు దూబే జరిగిందంతా పోలీసులకు వివరించారు.
ఇదీ చదవండి: రూ.20 కోసం గొడవ- ఇడ్లీ వ్యాపారి మృతి