దేశ రాజధాని దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారుకు, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు మధ్య పలు అంశాల్లో విభేదాలు వార్తలకెక్కుతూనే ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వ ప్రకటనలను పార్టీ ప్రచారం కోసం వాడుకున్నారని సక్సేనా ఆరోపించారు. వాటికి సంబంధించి రూ.97 కోట్లు అసలు మొత్తానికి.. వడ్డీకలిపి చెల్లించాలని ఆయన ఆప్‌ను ఆదేశించారు. దిల్లీ ప్రభుత్వ నిధుల నుంచి ఖర్చు చేసిన ఈ మొత్తాన్ని పార్టీ నుంచి వసూలు చేయాలని చీఫ్ సెక్రటరీకి సూచించారు. దాంతో తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం 'ఆమ్ ఆద్మీ పార్టీ'కి నోటీసులు ఇచ్చింది.
'నోటీసులు ఇచ్చిన పదిరోజుల్లో రూ.163,61,88,265 డిపాజిట్ చేయాలి. అందులో విఫలమైతే చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం' అని ఆ నోటీసుల్లో పేర్కొంది. మార్చి 31,2017 వరకు ఆప్ ప్రభుత్వం ప్రకటనల మీద చేసిన ఖర్చు రూ.99.31 కోట్లు కాగా.. వడ్డీతో కలిపి ఆ మొత్తం రూ.163.6 కోట్లకు చేరింది. దీనిపై దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా స్పందించారు. భాజపా, సక్సేనా ఎన్నికైన మంత్రులు, అధికార పార్టీని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు.
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించిన కొద్ది రోజుల వ్యవధిలో సక్సేనా నుంచి ఈ మేరకు ఆదేశాలు వెలువడటం గమనార్హం. అప్పట్లో దానిపై ఆప్ స్పందిస్తూ.. ఇటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేదని పేర్కొంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోనూ ప్రకటనలు ఇస్తుందని.. అయితే, కేవలం ఆప్ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. దిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే భాజపా ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు.