Aadhar card: ఆధార్ కార్డులో ఫొటో అసలు గుర్తు పట్టలేనంతగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మరొకరి ఫొటో వచ్చిన సందర్భాలు చూశాం. అయితే.. వింత పేరుతో ఉన్న ఓ చిన్నారి ఆధార్ కార్డు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ పేరు కారణంగా పాఠశాలలో అడ్మిషన్‌కు తిరస్కరించారు ఉపాధ్యాయులు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూ జిల్లా రాయ్‌పుర్ గ్రామంలో జరిగింది.
ఇదీ జరిగింది: బిల్సి తహసీల్దార్ ప్రాంతంలోని రాయ్‌పుర్ గ్రామానికి చెందిన దినేశ్ అనే వ్యక్తి తన కూతురు ఆర్తిని తీసుకుని అడ్మిషన్ ఇవ్వాలని ప్రాథమిక పాఠశాలకు శనివారం వెళ్లాడు. టీచర్ ఎక్తా వర్షిణి అడ్మిషన్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఆధార్ కార్డులో బాలిక పేరు స్థానంలో 'మధు కా పాంచ్ వా బచ్చా' అని హిందీలో ' బేబీ ఫైవ్ ఆఫ్ మధు' అని ఆంగ్లంలో రాసి ఉంది. కాని ఆర్తి అని ఎక్కడా లేదు. ఈ కారణంగానే తిరస్కరించినట్లు ఉపాధ్యాయురాలు తెలిపారు. ఆధార్ కార్డును సరిచేసుకుని తీసుకురావాలని దినేశ్‌కు సూచించారు.
ఈ అంశంపై స్పందించిన జిల్లా మెజిస్ట్రేట్ దీపా రంజన్..'ఆధార్ కార్డులను పోస్టాఫీసులు, బ్యాంకుల్లో సిద్ధం చేస్తారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తప్పులు దొర్లుతాయి. కార్డు తయారైన బ్యాంకు, పోస్టాఫీసు అధికారులను అప్రమత్తం చేసి నిర్లక్ష్యానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తాం' అని పేర్కొన్నారు.
వింత పేరుతో ఉన్న బాలిక ఆధార్ కార్డు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ కార్డుపై ఆధార్ నంబర్ సైతం లేకపోవటం గమనార్హం. అధికారుల తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదీ చూడండి: Old couple request for pension : ఆధార్ లేదని నిరాదరణ.. సాయం కోసం వృద్ధుల నిరీక్షణ