Organ Donation: కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం అని వింటూనే ఉంటాం. పుట్టడం, గిట్టడం ఏ ఒక్కరి చేతిలో ఉండేవి కావు. కానీ మరణశయ్యపై ఉంటూ మరో నలుగురికి అవయవాలను ప్రసాదించడం ఒక గొప్ప కార్యమని చెప్పవచ్చు. మట్టిలో కలిసే అవయవాలు మరో మనిషి శరీరంలోకి వెళ్లి నిత్య చేతనంగా నిలుస్తాయి. ఇది గ్రహించిన కొందరు ఆప్తులు మరణ అంచుల్లో ఉన్నప్పటికీ .. పరుల మేలు ఆలోచించి.. పునర్జన్మను ప్రసాదిస్తున్నారు.
తాజాగా ఓ యువవైద్యుడు తాను జీవించి లేకున్నా.. తన అవయవాలు మరొకరికి ఉపయోగపడాలని పరితపించాడు. విద్యార్థి దశలోనే అవయవదానానికి సమ్మతి తెలపడమే కాకుండా.. ఆ దిశగా చైతన్యపరిచేలా కవిత కూడా రాశారు. ఇటీవల ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవన్మృతుడిగా మారగా.. కుటుంబసభ్యులు అతని కోరిక నెరవేర్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
వనపర్తి జిల్లా అమరచింతకి చెందిన చిన్ని నిఖిల్ బెంగళూరులో బీఏఎంఎస్ పూర్తి చేశారు. అక్కడే ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 29న బెంగళూరు నుంచి ఏపీలోని కావలికి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిఖిల్ తలకు బలమైన గాయమైంది. అతనిని చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే మే 1న బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిఖిల్ తల్లిదండ్రులు చిన్ని రమేశ్, భారతికి తెలిపారు. కుమారుడి కోరిక మేరకు అవయవదానం చేసేందుకు వారు అంగీకరించారు. దీంతో ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి నిఖిల్‌ను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. ఆరుగురికి అవయవదాతగా నిలిచారు.
నిఖిల్ రాసిన కవిత ఇదీ..
నా తనువు మట్టిలో కలిసినా..
అవయవదానంతో మరొకరిలో జీవిస్తా..
ఒక అమ్మకు బిడ్డగా మరణించినా..
మరో అమ్మ పిలుపులో బతికేఉంటా..
ఏనాడూ వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్లు..
ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె
కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్రపిండాలు
ఊపిరి అందక ఊగిసలాడుతున్న వారికి ఊపిరితిత్తులు
కాలేయం పనిచేయక కాలం ముందు ఓడిపోతున్న వారికి నా కాలేయం నాలోని ప్రతి అణువూ అవసరమైన వారికి ఉపయోగపడాలి..
ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి
ఇదే మీరు నాకు ఇచ్చే గొప్ప బహుమతి
ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను, చిరంజీవినై ఉంటాను
అవయవదానం చేద్దాం..
మరో శ్వాసలో శ్వాసగా ఉందాం