ఆ ఆలయానికి భారీ ఎత్తున పోటెత్తిన భక్తులు దర్శనం ముగించుకుని కౌంటర్ వద్ద ప్రసాదం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాకిడి అధికమవడం వల్ల హడావుడిలో ఉన్న అధికారి లడ్డుకి బదులు రూ. 2.91 లక్షలు ఉన్న బ్యాగును భక్తుడికి ఇచ్చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని చామరాజనగర్లో జరిగింది.
ఇదీ జరిగింది: హనుర్ తాలుకాలోని మలిమహాదేశ్వర్ కొండపై ఉన్న గుడికి అమవాస్య సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే ప్రత్యేక దర్శనం వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారి.. లడ్డు ప్రసాదంతో పాటు పొరపాటున రూ. 2.91 లక్షల బ్యాగును భక్తుడికి అందజేశారు. ఆ తర్వాత తేరుకున్న అధికారి చూడగా డబ్బుల బ్యాగు కనిపించలేదు. బ్యాగు కోసం ఎంత వెతికినా జాడ లేదు. చివరకు సీసీటీవీ కెమెరాను పరిశీలించగా.. పొరపాటున భక్తుడికి ఇచ్చిన విషయం బయటపడింది. ఈ డబ్బు దేవస్థానానికి సంబంధించినదని.. ఖాతాలో జమ చేయడానికి తీయగా ఇలా జరిగిందని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: 'నోరు జారా.. క్షమించండి'.. రాష్ట్రపతి ద్రౌపదికి అధీర్ రంజన్ లేఖ
'ప్రభుత్వ ఉద్యోగులకు నెలసరి సెలవులు!'.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం