కేరళ కన్నూర్‌కు చెందిన ఓ సాధారణ కార్పెంటర్ కూతురు.. మ్యూజిక్ కీబోర్డును నైపుణ్యంతో వాయిస్తోంది. డాక్టర్ కావాలని ఆశయాంగా పెట్టుకున్న ఆ యువతి.. ఇప్పుడు వివిధ దేశాల్లో తన సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అమలా రవీంద్రన్.. కీబోర్డును తిరగేసి మరీ వాయిస్తోంది. ఇప్పటివరకు 200కు పైగా సంగీత కార్యక్రమాల్లో పాల్గొంది. వివిధ దేశాల్లో 20కి పైగా లైవ్ షోలు చేసింది.
కళ్లకు గంతలు కట్టుకొని మలయాళీ పాటకు కీబోర్డును తిరగేసి సంగీతం వాయించి రికార్డు కైవసం చేసుకుంది అమలా రవీంద్రన్. 2.42 నిమిషాల పాటు కీబోర్డును చూడకుండా ప్లే చేసి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
బహుముఖ ప్రజ్ఞాశాలి...
గత పదేళ్లుగా సంగీతం నేర్చుకుంటున్న అమల.. ఈ రంగంలో తన ఆశయాలను నెరవేర్చుకునేందుకు వైద్యురాలు కావాలన్న లక్ష్యాన్ని పక్కనబెట్టింది. విభిన్నంగా ఏదైనా ప్రయత్నించాలని తండ్రి చేసిన సూచనతో.. కీబోర్డును తిరగేసి చూడకుండా వాయించడం ప్రారంభించింది. కీబోర్డుతో పాటు గిటార్‌ను కూడా నైపుణ్యంతో వాయిస్తుంది అమల. కర్ణాటక సంగీతాన్ని సైతం నేర్చుకుంటోంది.
తన లక్ష్య సాధనలో కుటుంబసభ్యుల నుంచి పూర్తి సహకారం అందుతోందని అమల చెబుతోంది. కార్పెంటర్‌గా తన తండ్రి సంపాదించే మొత్తంలో చాలా వరకు.. తన సంగీతం కోసమే ఖర్చు చేస్తున్నారని వివరించింది. కేరళకే చెందిన ప్రఖ్యాత కీబోర్డ్ ప్లేయర్ స్టీఫెన్ దేవస్సీని ఆరాధించే అమల.. ఆయన దగ్గర శిష్యురాలిగా చేరాలని ఆశిస్తోంది.
ఇదీ చదవండి: 104 ఏళ్ల 'టాపర్' బామ్మ.. 89 శాతం మార్కులతో..