Free Fire Game Murder In Koraput: ఒడిశా కొరాపుట్ జిల్లాలో దారుణం జరిగింది. ఫ్రీఫైర్ ఆటలో తలెత్తిన గొడవ ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. మసిపుట్ గ్రామానికి చెందిన లులు భోయ్‌ను అతడి ఇద్దరు స్నేహితులు హత్యచేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ జరిగింది: మసిపుట్కు చెందిన లులు భోయ్ ఏడో తరగతి చదువుతున్నాడు. లులుతో పాటు అతడి ఇద్దరు స్నేహితులు స్థానిక పాఠశాల సమీపంలో ఫ్రీఫైర్ ఆడుతున్నారు. అయితే, గేమ్ ఓడిపోయిన లులు.. మరోసారి ఆడేలా మొబైల్‌ను ఇవ్వాలని కోరాడు. ఈ విషయమై ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇద్దరు కలిసి లులు తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని కోలాబ్ నది దగ్గర పడేశారు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: రేప్ కేసు వాపస్ తీసుకోవాలని బెదిరింపులు.. నిప్పంటించుకున్న బాలిక