దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి దృష్ట్యా వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేసేలా విదేశీ టీకాలను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే, ఇవి ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో భారత్‌కు ఫైజర్ టీకాలు ఎప్పుడు తీసుకొస్తారంటూ పుణెకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా ఆ సంస్థ సీఈవో, ఛైర్మన్ ఆల్బర్ట్ బోర్లాకు మెయిల్ చేశారు. అయితే, దీనికి ఫైజర్ సీఈవో స్పందించి ప్రత్యుత్తరం పంపడం విశేషం.
ఎప్పుడొస్తుంది?
పుణెకు చెందిన 58ఏళ్ల ప్రకాశ్ మీర్‌పురి వృత్తిరీత్యా మార్కెటింగ్ ప్రొఫెషనల్. ఇటీవల ఆయన కరోనా బారినపడటంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న టీకాలు, వాటి సమర్థత గురించి మీడియా కథనాల ద్వారా తెలుసుకున్నారు. విదేశాల్లో ఉన్న స్నేహితులతోనూ చర్చించారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉండే తన స్నేహితుడు ఒకరు ఫైజర్ టీకా వేయించుకోమని సలహా ఇచ్చారట. అయితే, ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ భారత్‌లో అందుబాటులో లేకపోవడంతో ఎప్పుడు తీసుకొస్తారంటూ ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బోర్లాకు ప్రకాశ్ మెయిల్ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఫైజర్‌తో పాటు మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలకు కూడా ఆయన మెయిళ్లు పంపారని తెలిపాయి. కాగా.. ప్రకాశ్ మెయిల్‌కు ఫైజర్ సీఈవో స్పందించారు. త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామంటూ మెయిల్ పంపారు.
"భారత్‌లో మా టీకా ఇంకా నియంత్రణ సంస్థల నుంచి అనుమతి పొందలేదు. టీకా పంపిణీ కోసం భారత్‌తో ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అనుమతులు తీసుకుని భారత్‌లో ఫైజర్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం." అని బోర్లా లేఖలో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ ఏడాది జులై - అక్టోబరు మధ్య భారత్‌కు 5 కోట్ల టీకాలను పంపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఫైజర్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా అక్కడి టీకా తయారీ సంస్థలతో చర్చలు జరిపారు.
ఇదీ చదవండి : Covid Origin: 'కరోనా.. చైనా శాస్త్రవేత్తల సృష్టే'