భార్యను కిరాతకంగా గొంతు కోసి చంపి, ఇంటికి నిప్పు పెట్టాడు ఓ వ్యక్తి. గుజరాత్ అహ్మదాబాద్ గోద్రెజ్ గార్డెన్ సిటీలో జరిగిందీ ఘటన. భార్య మృతి చెందగా మంటల్లో గాయపడిన భర్తను ఆస్పత్రిలో చేర్పించారు స్థానికులు. దంపతుల మధ్య గొడవే ఈ దారుణానికి కారణమని తెలిసింది.
వివరాల్లోకి వెళ్తే.. గోద్రెజ్ గార్డెన్ సిటీలోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో 405 నంబర్ ఫ్లాట్‌లో గత ఏడేళ్లుగా అనిల్ బాధేల్, అనిత బాధేల్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. శుక్రవారం ఉదయం పిల్లలను పాఠశాలకు పంపించిన అనంతరం వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. భర్తపై కోపం పెంచుకున్న అనిత తన చేతిలో ఉన్న కూరగాయల కత్తితో అనిల్‌పై దాడికి దిగింది. ఈ క్రమంలో అనిల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అనిల్ అదే కత్తితో క్షణికావేశంలో అనిత గొంతు కోసి చంపేశాడు. అంతటితో ఆగకుండా వారు ఉంటున్న ఇంటికే నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో అనిత కత్తిపోటు వల్ల ప్రాణాలు విడిచింది. అనిల్ మంటల వ్యాప్తి కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు.
ఇంటి కిటికీలో నుంచి బయటకు పొగలు రావటం గమనించిన సెక్యూరిటీ గార్డ్ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ప్రమాదం జరిగిన గంట తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దంపతులిద్దరి మధ్య కుటుంబ కలహాలు వంటివి ఏమీ లేవని, నిందితుడు అనిల్ బాధేల్ ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు.
భర్త ఆత్మహత్య.. కుళ్లిన మృతదేహం చూసి..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్ జిల్లాలో కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, నెల రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన మృతుడి భార్య.. భర్త కుళ్లిన మృతేేదేహాన్ని చూసి బోరున విలపించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన సుదామ శర్మ తన భార్య కీర్తితో కలిసి శివారు ప్రాంతంలో నివాసముండేవాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య మనస్ఫర్థలు రావటం వల్ల ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. సుమారు నెల రోజుల తర్వాత భర్త ఉంటున్న ఇంటికి తిరిగి వచ్చిన కీర్తి గది లోపల కుళ్లిన స్థితిలో ఉన్న భర్త మృతదేహాన్ని చూసి షాక్‌కు గురైంది. నిర్మానుష్య ప్రాంతంలో సుదామ శర్మ ఇల్లు ఉండటం వల్ల అతడు చనిపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, చనిపోయిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై మృతుడి బంధువుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.
"గతేడాది డిసెంబర్ 18న ఇంటి నుంచి వెళ్లిపోయాను. డిసెంబర్ 21 వరకు నా భర్తతో ఫోన్లో మాట్లాడాను. అనంతరం ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరగలేదు. దీంతో అదే రోజు సుదామ శర్మ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉంటాడు" అని మృతుడి భార్య తెలిపింది.