కరోనా అనే పదం వింటే చాలు.. బెదిరిపోయి ఆమడదూరం పారిపోతున్నారు ప్రజలు! మరి కొవిడ్ రోగికి సాయం చేయమంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అయితే కర్ణాటక బెంగళూరుకు చెందిన 'మెర్సీ ఏంజెల్స్' యువ బృందం దీనికి భిన్నం. సాయం కావాలని ఒక్క ఫోన్ చేస్తే చాలు.. రయ్మని క్షణాల్లో వచ్చి వాలిపోతారు. బాధితులకు ఏం కావాలో తెలుసుకుని అన్ని పనులు వారే చేస్తారు. అది కూడా ఉచితంగా. కరోనా మృతదేహాలు ఖననం చేయడానికి మేమున్నామంటూ.. అంతిమసంస్కారాలు నిర్వహిస్తున్నారు.
ఏడాది నుంచి 1000కి పైగా..
కొవిడ్ మృతదేహాలను ఖననంలో చేయడంలో ఎన్నో అమానవీయ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయితే మెర్సీ ఏంజెల్స్.. కరోనా ప్రారంభం నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. కొవిడ్ తొలిదశ నుంచి ఇప్పటివరకు మొత్తం వెయ్యికి పైగా కరోనా మృతదేహాలకు అంతిమసంస్కారాలు జరిపారు. అది కూడా ఏదో తూతూ మంత్రంగా కాకుండా.. బాధితుల మతాచారాల ప్రకారం చేస్తున్నారు.
కరోనా రెండోదశలో గతనెల రోజులుగా 150పైగా శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సాయం కావాలన్నవారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు.
సాయం కావాలంటే..
తన్వీర్ అహ్మద్ నేతృత్వంలోని సుమారు 40 మంది యువతీయువకులు.. 'మెర్సీ ఏంజెల్స్' బృందంగా ఏర్పడ్డారు. గతేడాది కాలంగా సామాజిక సేవలో నిమగ్నమై మానవత్వాన్ని చాటుకుంటున్నారు. బాధితులకు సాయం కావాలంటే.. తన్వీర్ నంబరు(9886194492) ద్వారా ఉచితంగా అంబులెన్స్ సేవలు పొందవచ్చు.
ఇదీ చూడండి: పెళ్లి వేడుకలో కలెక్టర్ హల్చల్