డాక్టర్ల దినోత్సవం రోజునే మహారాష్ట్ర పుణెలో విషాదకర ఘటన జరిగింది. వైద్యులైన నవ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నికిల్ షేండకర్(27), అంకిత నికిల్ షేండకర్(26)లు ఇటీవలే వివాహం చేసుకుని పుణెలోని వావండి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు. అంకిత.. మానసిక వైద్యురాలు. నికిల్ ఆయుర్వేద వైద్యుడు. ఇద్దరు వేరువేరు చోట్ల విధులు నిర్వర్తించేవారు. డాక్టర్ల దినోత్సవం రోజున విధులు నిర్వహించుకుని వస్తుండగా.. నికిల్, అంకిత ఫోన్లో వాగ్వాదం చేసుకున్నారు. నికిల్ ఇంటికి వచ్చేలోపే అంకిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సాధారణంగా ఇంటికి వచ్చిన నికిల్.. అంకితను చూసి నిర్ఘాంతపోయాడు. అనంతరం అతను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.
ఇవీ చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకుందని.. కన్న తండ్రే...