Cancer hospital in Assam: ఈశాన్య రాష్ట్రం అసోంలో వరదలు బీభత్సం సృష్టించాయి. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాఛార్ జిల్లా సిల్చర్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. దాదాపు అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ కాఛార్ క్యాన్సర్ హాస్పిటల్ సొసైటీలో రోగులకు సేవలను మాత్రం నిలిపివేయలేదు. ఆస్పత్రి ప్రాంగణం నీటిలో మునిగినా పడవల ద్వారా రోగులను లోపలకు తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు.
తేలికపాటి చికిత్స కావాల్సిన క్యాన్సర్ రోగులకు ఆస్పత్రి బయటే వైద్యం అందిస్తున్నట్లు ఈ హాస్పిటల్ డైరెక్టర్ డా.రవి కన్నన్ తెలిపారు. సీరియస్ రోగులను మాత్రం లోపలకు తీసుకెళ్లి అవసరమైన చికిత్స అందేలా చూస్తున్నట్లు చెప్పారు. క్యాన్సర్ రోగులకు ఒక్క రోజు కూడా చికిత్స అందించకుండా ఉండలేమని, అందుకే వరదలొచ్చి, నీటి మునిగినా సేవలు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. రోగులను పడవల ద్వారా లోపలకు తీసుకెళ్లేందుకు సహాయక సిబ్బంది సేవలను ఉపయోగించుకుంటున్నారు.
Assam News: మరోవైపు వరదల కారణంగా ఎటు చూసినా జలమయం కావడం వల్ల మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే వారిని శ్మశానవాటికలకు తీసుకెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాఛార్ జిల్లా అధికార యంత్రాంగం కూడా వీరికి సాయం అందించలేని పరిస్థితి నెలకొంది. సిల్చర్ సమీపంలోని చుత్రసంగన్ గ్రామానికి చెందిన నిరేన్ దాస్ అనే వ్యక్తి జూన్ 24న చనిపోగా.. రెండు రోజుల పాటు అంతిమసంస్కరాలు నిర్వహించలేకపోయారు కుటుంబసభ్యులు. చివరకు రామేంద్ర దాస్ అనే కాలేజీ టీచర్ వారికి సాయం చేశారు. శవాన్ని తరలించేందుకు ఓ పడవ ఏర్పాటు చేశారు. అయితే ఎటు చూసినా నీరే ఉండటం వల్ల శవాన్ని ఖననం చేసేందుకు పడవలోనే 15 కిలోమీటర్లు ప్రయాణించారు. చివరకు ఓ ప్రదేశంలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
ఈ ప్రాంతంలోనే గతవారం ఓ మహిళ శవం వరదలో కొట్టుకొచ్చింది. స్థానిక వలంటీర్లు మృతదేహం వద్దకు చేరుకోగా.. తన తల్లి శవాన్ని చూసిన వారు అంతిమసంస్కారాలు నిర్వహించాలని ఓ లేఖ రాసి ఉంది. వరదల వల్ల తాను దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్లు మృతురాలి కుమారుడు లేఖలో చెప్పాడు. ఆ తర్వాత వలంటీర్లు శవానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
అయితే ఇప్పుడిప్పుడే సిల్చర్ ప్రాంతంలో వరద పరిస్థితి మెరుగుపడుతోంది. ముంపు ప్రాంతాల్లో నీటి స్థాయి తగ్గుతోంది. మరికొద్ది రోజుల్లో తిరిగి సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: కోతికి చిప్స్ ఇస్తూ 100అడుగుల లోయలో పడిపోయిన టూరిస్ట్