8 KG Tumor Removed Tamil Nadu : అత్యంత అరుదైన ఆపరేషన్‌లో భాగంగా తమిళనాడులోని ఓ ఆస్పత్రి వైద్యులు ఎనిమిది కేజీల కణతిని ఓ రోగి శరీరంలో నుంచి తొలగించారు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న మహిళ శరీరం నుంచి ఈ కణతిని బయటకు తీశారు. ఈ ఆపరేషన్ రాణిపేట్‌లోని రాజేశ్వరి ఆస్పత్రిలో జరిగింది.
6 నెలలుగా నొప్పి..
తిమిరి ప్రాంతంలోని తమరైపక్కం గ్రామానికి చెందిన ఉమ గత ఆరు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. గ్రామంలో తగిన సౌకర్యాలు లేకపోవడం, సమస్యపై అవగాహన కొరవవడం వల్ల ఆమె చికిత్స చేయించుకోలేదు. కడుపు నొప్పి ఎంత తీవ్రమైనా.. పట్టించుకోలేదు. చివరకు, నాలుగు రోజుల క్రితం ఆమె రాజేశ్వరి ఆస్పత్రిలో చేరింది. అక్కడ వైద్యులు కపిల్ నాగరాజ్, మహ్మద్ సాహిత్ల బృందం మహిళ పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చింది. పరీక్షలు నిర్వహించి మహిళ సమస్యను గుర్తించింది.
అంతకంతకూ పెరుగుతూ..
స్కానింగ్‌లో ఆమెకు కణతి ఉన్నట్లు తేలింది. ఉమ గర్భాశయంలో ఇది ఏర్పడినట్లు గుర్తించారు. ఇది అంతకంతకూ పెరుగుతోందని వైద్యులు అంచనాకు వచ్చారు. దీంతో, సమయం వృథా చేయకుండా ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. మూడు గంటల పాటు కష్టపడి కణతిని విజయవంతంగా ఉమ శరీరం నుంచి తొలగించారు. ఇతర శరీర భాగాలకు ఎలాంటి నష్టం జరగకుండా సర్జరీ పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. కణతి బరువు 8 కేజీలు ఉందని చెప్పారు.
"ఇలాంటి వేగంగా పెరుగుతున్న కణతులను వెంటనే గుర్తించాల్సిన అవసరం ఉంది. ముందుగానే సమస్యను గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలకు ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించాలి. ఎలాంటి సమస్యలు ఉన్నట్టు అనిపించినా.. ప్రజలు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రస్తుతం ఉమ పరిస్థితి నిలకడగా ఉంది. ఆపరేషన్ అనంతరం చికిత్స కొనసాగుతోంది."
-కపిల్ నాగరాజ్, వైద్యుడు
పియానో వాయిస్తూ శస్త్ర చికిత్స చేయించుకున్న చిన్నారి
కాగా, గతంలో ఓ చిన్నారికి వినూత్న సర్జరీ నిర్వహించారు మధ్యప్రదేశ్ వైద్యులు. మెదడులో కణతితో బాధపడుతున్న చిన్నారికి.. మెలకువగా ఉన్న సమయంలోనే ఆపరేషన్ నిర్వహించారు. పియానో వాయిస్తూ ఆమె శస్త్రచికిత్స చేయించుకున్న ఘటన అప్పట్లో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.