బంగాల్లోని ఉత్తర దినాజ్పుర్లో చెరువులోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు మృతి చెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ప్రయాణికులతో ఝార్ఖండ్ నుంచి లఖ్నవూ వెళ్తున్న బస్సు రాయిగంజ్లోని 34వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి 10.45 నిమిషాల ప్రాంతంలో ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. అయితే ఓ వాహనాన్ని(ట్రక్కుగా అనుమానం) బస్సు ఢీకొట్టిన అనంతరం అదుపు తప్పి.. చెరువులోకి దూసుకెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. తొలుత స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించి.. అధికారులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.