Narayanpet Accident Today : రాష్ట్రంలో రహదారులు రక్తమోడుతున్నాయి. రోడ్డుపైకి రావాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. మృత్యువు ఏ వైపుగా వచ్చి కబళిస్తుందోనని భయపడుతున్నారు. గడిచిన మూడు, నాలుగు రోజుల్లోనే వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో సుమారు 20 మంది వరకు దుర్మరణం చెందడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల మెదక్ జిల్లా చేగుంట మండలంలో జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. గురువారం రోజున మహారాష్ట్రలో జరిగిన యాక్సిడెంట్‌లో సిద్దిపేట జిల్లాకు చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. మరో ఘటనలో వేర్వేరు చోట్ల నలుగురు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు మరవక ముందే తాజాగా నారాయణపేట జిల్లాలో జరిగిన ప్రమాదంలో మరో నలుగురు అనంతలోకాలకు చేరారు.
నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నల్లగుట్ట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని నలుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా గ్రామానికి చెందిన ఆంజనేయులు, నర్సమ్మలు తమ పిల్లలు సమర్థ్ (5), అనిరుధ్‌లతో కలిసి బైక్‌పై మక్తల్ మండలం భూత్పూర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో నల్లగుట్ట వద్దకు చేరుకోగానే మాగనూరు మండలం ఓబుళాపూర్‌కు చెందిన పల్లె అశోక్ ద్విచక్ర వాహనం వీరిని ఢీకొట్టింది. ఘటనలో అశోక్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆంజనేయులు (35), నర్సమ్మ (30)లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సమర్థ్‌ను రాయచూరులోని ఆసుపత్రిలో చేర్చగా.. అనిరుధ్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
విక్రయాల ప్రయాసలో ప్రాణమే పోయింది..: మరోవైపు ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టిన ఘటనలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ తనకున్న ఎకరం పొలంలో వరి పంట పండించారు. ఆ ధాన్యాన్ని 15 రోజుల కిందట ఐకేపీ కేంద్రానికి తరలించినా.. తూకం వేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అదే ఊరికి చెందిన మరో రైతు కృష్ణదీ అదే పరిస్థితి. దీంతో ఏదో ఓ ధరకు ప్రైవేట్‌గానైనా అమ్ముకుందామని ఇద్దరూ కలిసి రైస్ మిల్లు యాజమాన్యంతో మాట్లాడుకుందామని బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో సంగారెడ్డి వైపు నుంచి వస్తున్న ఆటో వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా.. కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాస్‌కు భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇవీ చూడండి..
Accident While going to BRS Meeting : బీఆర్ఎస్ మీటింగ్‌కు వెళ్తుండగా ప్రమాదం.. 14 మందికి గాయాలు
Woman Suicide In Amberpet : 'నువ్వు లేక నేను లేను' అంటూ భర్త చెంతకు..