వైద్యేతర అవసరాల కోసం ద్రవీకృత ప్రాణవాయువు(లిక్విడ్ ఆక్సిజన్) వాడకంపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. ఒకరోజు అనంతరం తన నిర్ణయాన్ని సడలించింది. ఇంజక్షన్ సీసాల తయారీ(యాంప్యూల్స్, వయల్స్), ఫార్మా, రక్షణ రంగాల్లో లిక్విడ్ ఆక్సిజన్‌ను వినియోగించటానికి సోమవారం అనుమతులు తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ఈ మూడు రంగాల వారు ఇకపై ఆక్సిజన్ వినియోగించవచ్చని స్పష్టం చేశారు.
దిల్లీ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో వైద్య కోసం తప్ప మరే ఇతర అవసరాలకు లిక్విడ్ ఆక్సిజన్ వాడకూడదని అజయ్ భల్లా ఆదివారం స్పష్టం చేశారు. కొవిడ్ బాధితులకు ఇబ్బంది లేకుండా నిరంతంర ఆక్సిజన్ అందుబాటులో ఉంచడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రాణవాయువు కోసం ప్రయత్నాలు..
మరోవైపు వివిధ ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా చేయడం కోసం కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాలకు రైళ్ల ద్వారా ప్రాణవాయువును సరఫరా చేస్తోంది. యూఏఈ, సింగపుర్ నుంచి క్రయోజెనిక్ ట్యాంకులను దిగుమతి చేసుకుంటోంది. అమెరికా నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పొందేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదీ చూడండి: ఆసుపత్రి సిబ్బంది- రోగి బంధువుల మధ్య ఫైటింగ్