3 Month Baby World Record : ఏవైనా గుర్తింపు పత్రాలు సంపాదించాలంటే అనేక కష్టాలు పడాల్సి ఉంటుంది. అధికారుల చుట్టూ తిరిగి అలిసిపోయి ఉంటారు. కానీ మధ్యప్రదేశ్ ఛింద్వాఢాకు చెందిన మూడు నెలల చిన్నారి.. ఆ గుర్తింపు పత్రాలతోనే ప్రపంచ రికార్డు సాధించింది. పుట్టిన 72 రోజుల్లోనే 31 రకాల ధ్రువపత్రాలు సాధించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఆమె కథేంటంటే?
ఇదీ కథ
ఛింద్వాడాలోని ఛందన్గావ్కు చెందిన కేసరి నందన్ సూర్యవన్షి, ప్రియాంక సూర్యవన్షి దంపతులిద్దరూ తపాలా శాఖలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి మూడు నెలల క్రితం శరణ్య సూర్యవన్షి అనే చిన్నారి జన్మించింది. అయితే, ఆమె పుట్టుక ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలని అనుకున్నారు తల్లిదండ్రులు. దీనికోసం ఏం చేయాలని అనేక రకాలుగా ఆలోచించారు. ఈ క్రమంలోనే ఓ రోజు వార్తల్లో గుర్తింపు పత్రాల గురించి విన్నారు. వెంటనే గుర్తింపు పత్రాలతో రికార్డు సృష్టించాలని నిశ్చయించుకున్నారు. దీనిపై వెతకగా.. 28 పత్రాలతో ఓ చిన్నారిపై ఈ రికార్డు ఉందని తెలుసుకున్నారు. ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు చిన్నారి శరణ్య పేరుపై గుర్తింపు పత్రాలు సంపాదించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే జన్మించిన 72 రోజుల్లోనే 31 పత్రాలు సంపాదించిన శరణ్య.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. అనంతరం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు దరఖాస్తు చేయగా.. అందులోనూ చోటు దక్కించుకుంది.
ప్రస్తుతం శరణ్య వయసు మూడు నెలలు కాగా.. ఇప్పటి వరకు ఆమెకు 33 గుర్తింపు పత్రాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెప్పారు. పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, సమగ్ర ఐడీ, వ్యాక్సినేషన్ కార్డ్, కుల, నివాస ధ్రువీకరణ, నేషనల్ హెల్త్ కార్డ్, సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీస్, బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం, పీపీఎఫ్ ఇలా అనేక రకాలైన పత్రాలు ఉన్నట్లు వివరించారు. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని.. మరి కొన్ని పత్రాల కోసం కూడా దరఖాస్తు చేస్తామని తల్లి ప్రియాంక తెలిపారు. శరణ్య తల్లిదండ్రులతో పాటు తాత గోపాల్ సూర్యవన్షి సైతం తపాలా శాఖలోనే పనిచేస్తున్నారు. సరైన పత్రాలు లేక ప్రజలు అనేక ఇబ్బందుల పడుతుంటారని.. వారిలో అవగాహన కల్పించేందుకే ఇలా చేశామని తెలిపారు. సకాలంలో అధికారుల అడిగిన వివరాలతో దరఖాస్తు చేస్తే సులువుగా అందుకోవచ్చని చెప్పారు.
రెండున్నరేళ్ల చిన్నారికి 'సూపర్ మెమొరీ'.. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
వయసు 23 నెలలే.. ప్రపంచ రికార్డుల్లో చోటు.. ఈ బుడ్డోడి తెలివికి సలాం!