290 Stone Pillars In India : ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. దేశంలోని మొత్తం 290 ప్రాంతాల్లో 'శ్రీరామ' రాతి స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వ్యయాన్ని అశోక్ సింఘాల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ భరిస్తుందని ఆయన తెలిపారు. వీటి నిర్మాణంలో ప్రభుత్వానికి చెందిన ఒక్క రూపాయిని కూడా వాడబోమని రాయ్ స్పష్టం చేశారు.
స్తంభాలపై వాల్మీకి శ్లోకాలు!
దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించనున్న ఈ 290 స్తంభాలకు అయ్యే పూర్తి ఖర్చులను అశోక్ సింఘాల్ ఫౌండేషనే వెచ్చిస్తుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి మీడియాకు తెలిపారు. శ్రీరాముడి జీవిత చరిత్రతో పాటు ఆయన ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా ఈ స్తంభాలు ఉంటాయని ఆయన వివరించారు. అలాగే వీటిని ఏర్పాటు చేసే స్థలానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో ఉన్న స్థల పురాణం లాంటి వివరాలను కూడా స్థానిక భాషలోనే అందరికీ అర్థమయ్యే విధంగా ఉండేలా చూస్తామని శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్టు తెలిపింది.
"అశోక్ సింఘాల్ ఫౌండేషన్ పేరుతో దిల్లీలో ఒక ట్రస్ట్ ఉంది. శ్రీరాముడి జీవితం, ఆయన విశిష్టతను భావితరాలకు తెలియజేసేలా వాటి వివరాలను రాతి స్తంభాలపై చెక్కి దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో స్థాపించాలనేది ఈ స్వచ్ఛంద సంస్థ కల. అంతేకాకుండా ఏర్పాటు చేసే స్తంభాలపై వాల్మీకి రామాయణంలోని ఆయా స్థలాల ప్రాముఖ్యతను వివరించే విధంగా ఉండే వాల్మికీ శ్లోకాలను కూడా పొందుపరచాలనేది ఫౌండేషన్ ఆలోచన. వీటిని స్థానిక భాషలోనే ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం."
- చంపత్ రాయ్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి
సెప్టెంబర్ 27న మొదటి స్థూపం!
ఈ 290 స్తంభాల ఏర్పాటు మహా కార్యక్రమంలో భాగంగా తయారు చేయిస్తున్న మొదటి స్థూపం సెప్టంబర్ 27న(బుధవారం) అయోధ్యకు చేరుకుంటుందని.. అనంతరం దీనిని మణి పర్వతంపై ప్రతిష్ఠిస్తామని ట్రస్టు సభ్యులు తెలిపారు.