ఒకే కుటుంబానికి చెందిన 26 మంది కరోనా మహమ్మారిని జయించి కొవిడ్ బాధితులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వీరిలో 85 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నారు. యోగా చేయడం, పౌష్టిక ఆహారం తీసుకోవడం సహా కొవిడ్ మార్గదర్శకాలను పాటించడం ద్వారా ఇది సాధ్యమైందని ఆ కుటుంబం వెల్లడించింది.
కుటుంబ పెద్ద అయిన 85 ఏళ్ల రాఘవేంద్ర ప్రసాద్ మిశ్రా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ దక్షిణ మలాకాలో తన 8 మంది కుమారులు, వారి కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. వీరిలో ఒకరికి గత నెలలో కరోనా సోకంది. దీంతో 31 మంది ఉండే ఆ ఇంట్లో రాఘవేంద్ర మిశ్రా సహా మరో 25 మంది కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. 2012లో తన కుమారుడికి కిడ్నీ దానం చేసినప్పటి నుంచి ఒకటే కిడ్నీతో జీవిస్తున్న రాఘవేంద్ర మిశ్రాకు కరోనా సోకడంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అయితే ఆయన మాత్రం తాను కరోనాను జయిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రోజూ వ్యాయామం, యోగా సహా కఠిన నియమాలతో రాఘవేంద్ర మిశ్రా కరోనాను జయించారు.
సమష్టి కృషితో విజయం..
రాఘవేంద్ర మిశ్రా కుమారుడైన డాక్టర్ మునీ మిశ్రా.. ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యుల ఆరోగ్య స్థితిని పరిశీలించేవారు. ఆక్సిజన్ తగ్గిన వారికి ఆక్సిజన్ ఏర్పాట్లు చేశారు. యోగా శిక్షకురాలైన రాఘవేంద్ర మిశ్రా కోడలు శశి కూడా.. కుటుంబసభ్యలకు యోగా చేయిస్తూ ఆరోగ్యంగా ఉండేలా కృషి చేశారు.
ఇదీ చదవండి : 92 ఏళ్ల వృద్ధ ఖైదీని గొలుసులతో కట్టి చికిత్స