కొవిడ్-19 వల్ల అధికంగా ప్రభావితమైంది నగరాలేనని జెనీవా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) అధ్యయనం వెల్లడించింది. కొవిడ్ తర్వాత దేశవృద్ధిలో ఇవే కీలకపాత్ర పోషించాల్సి ఉందని తెలిపింది. జీడీపీలో 70 శాతం వాటా పట్టణాలు, నగరాల నుంచే వస్తోందని, నిమిషానికి సగటున 25-30 మంది గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వస్తున్నారని తెలిపింది. దేశంలోని పెద్ద నగరాల్లో ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్నాయని, మురికివాడలు విస్తరించడం, పట్టణాల్లో పేద జనాభా పెరగడం దీనికి నిదర్శనమని 'మహమ్మారి తర్వాత భారతీయ నగరాలు' పేరుతో విడుదల చేసిన ఈ అధ్యయనంలో పేర్కొంటూ, పలు సూచనలు చేసింది. ప్రణాళిక, గృహ నిర్మాణం, రవాణా, పర్యావరణం, ప్రజారోగ్యం, లింగం, బలహీన వర్గాలు అనే 7 అంశాల్ని పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ, దేశీయ నిపుణులతో ఈ అధ్యయనం నిర్వహించింది. అందులోని అంశాలివీ..
- దేశంలో 2.5 కోట్ల కుటుంబాలు-పట్టణ ప్రాంతాల్లో నివసించే 35 శాతం కుటుంబాలు మార్కెట్ ధరల వద్ద గృహాలు కొనుగోలు చేసే అవకాశం కనిపించడం లేదు. అందుకే అందరిని కలుపుకొని పోయేలా పట్టణ నివాస కొత్త నమూనాను తీసుకొచ్చి నగరాల్లో ఆరోగ్యకర వాతావారణం నెలకొనేలా చూడాలి.
- కొవిడ్ వల్ల తక్కువ ఆదాయ వర్గాలు, వలస కార్మికులు ఆదాయం కోల్పోవడంతో పాటు సామాజిక భద్రత కూడా దూరమైంది. ప్రైవేటు, ప్రజా జీవితంలో లింగ ఆధారిత అసమతౌల్యం పెరిగింది.
- సంక్షోభ సమయంలో అత్యవసర కార్యకలాపాలు నిర్వహించడానికి, ప్రత్యక్షంగా నగరాలకు సహాయం చేయడంలో డేటా కీలక పాత్ర పోషిస్తుంది. స్థానిక ప్రభుత్వాల వికేంద్రీకరణ, సాధికారత కూడా సత్వర స్పందనకు దోహదం చేస్తుంది.
- అందుబాటు ధరల్లో ఇళ్లు నిర్మించేందుకు సరఫరా వైపు ఉన్న అడ్డంకుల్ని పరిష్కరించడంతో పాటు, కార్మికులు నగరాలకు వలస వచ్చి ఉండేందుకు అనువైన అద్దె గృహాల మార్కెట్‌ను ప్రోత్సహించాలి.
- పాక్షిక పట్టణ ప్రాంతాల నుంచి ప్రజలు పట్టణ ప్రాంతాలకు సులువుగా చేరేందుకు రవాణా రంగంపై అధికంగా పెట్టుబడులు పెట్టాలి. నగరాల్లో ఆరోగ్య సామర్థ్యాన్ని పెంచేందుకు శిక్షణ పొందిన ఆరోగ్య సంరక్షకుల్ని నియమించాలి.
- ప్రస్తుత, భవిష్యత్ డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పించాలి. పట్టణాల్లో అవకాశాల్ని పొందడానికి మహిళలు, బలహీన వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించి వారు భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించాలి.
- పట్టణ పునర్నిర్మాణ ప్రయత్నాల్లో భాగంగా పర్యావరణ స్థిరత్వం, వాయు కాలుష్యం, విపత్తు నిర్వహణపై చర్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
- 'చక్కగా రూపొందించిన, పాలించిన నగరాలు డైనమిక్ కేంద్రాలుగా ఉంటాయి. ఇవి ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తాయి. ఆర్థిక ఉత్పాదకతను పెంచుతాయి. పౌరులకు మంచి జీవన ప్రమాణాల్ని అందిస్తాయి. చారిత్రక పట్టణ సవాళ్లను పరిష్కరించడానికి, సానుకూల దీర్ఘకాలిక మార్పు తీసుకురావడానికి ఈ మహమ్మారిని ఒక అవకాశంగా మలచుకోవాలి' అని డబ్ల్యూఈఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ఇండియా, దక్షిణాసియా హెడ్ విరాజ్ మెహతా వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆకాశాన అతివల ఘనత- 17 గంటల్లో 16 వేల కి.మీ