Karnataka youth death news: కర్ణాటక బెంగళూరు మట్టికెరెలో 22 ఏళ్ల యువకుడు కిశోర్.. ఇంటర్నెట్ కేబుల్ ద్వారా షాక్ కొట్టి మరణించాడు. అతను ఫుట్‌పాత్‌పై నడుస్తున్నప్పుడు చెట్టుకు వెలాడుతూ రోడ్డుపై పడి ఉన్న కేబుల్ వైర్‌పై కాలుపెట్టాడు . అది అప్పటికే కరెంటు తీగకు ఆనుకొని ఉండటం, సీల్ చేయకపోవడం వల్ల షాక్ కొట్టింది. దీంతో కిశోర్ అక్కడికక్కడే కుప్పకూలాడు. అక్కడున్న పాదచారులు అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. యువకుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సంజయ్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది.
అధికారుల నిర్లక్ష్యం వల్లే కిశోర్ చనిపోయాడని అతని సోదరుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ(BESCOM), ఇంటర్నెట్ కంపెనీ సిబ్బందిపై కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, విద్యుత్ సరఫరా నిలిపివేయించారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. కేబుల్ వైర్‌కు సీల్ కూడా చేయించారని పేర్కొన్నారు. ఆ చుట్టుపక్కల ఇలాంటి కేబుల్ వైర్లు ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అని పోలీసులు, BESCOM అధికారులు తిరిగి చూశారని తెలిపారు.
బెంగళూరు రూరల్ జిల్లా గెద్దలహళ్లికి చెందిన కిశోర్.. పని కోసం బెంగళూరు నగరానికి వలసవెళ్లాడు. ఓ నిర్మాణ ప్రదేశంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతని కుటుంబం కూడా అక్కడే నివసిస్తోంది. కిశోర్ మృతి అనంతరం BESCOM కార్యాలయం ఆవరణలో కుటుంబసభ్యులు నిరసన చేపట్టారు. తామంతా అతనిపైనే ఆధారపడ్డామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: విద్యుత్ తీగకు తగిలిన రథం.. 11 మంది సజీవదహనం