కర్ణాటకలో.. రెండు వేరువేరు ఘటనల్లో 20మందిని బెంగళూరు సౌత్ విభాగం పోలీసులు(bangalore online fraud) అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో వీడియోలు చూసి, లైక్ చేసి షేర్ చేస్తే డబ్బులిస్తామని వీరు ఆశపెట్టి.. భారీగా డిపాజిట్లు చేయించుకున్నారు(bangalore fraud case). రెండు ఘటనల్లో మొత్తం రూ. 30 కోట్ల మేర మోసం చేశారు. రూ. 16.4కోట్లకుపైగా నగదును పోలీసులు జప్తు చేశారు.
సూపర్ లైక్...
ప్రజలను మోసం చేసేందుకు నిందితులు సూపర్ లైక్ యాప్‌ను ఉపయోగించుకున్నారు. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు వలవేశారు. సామాజిక మాధ్యమాల్లోని సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను లైక్ చేసి షేర్ చేస్తే.. ఒక్కోదాని మీద రూ. 20 ఇస్తానని నమ్మించారు. అయితే ఈ పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం తొలుత కొంత నగదును డిపాజిట్ చేయాలని షరతు పెట్టారు. అది నమ్మి వేలాది మంది ప్రజలు భారీ మొత్తంలో డిపాజిట్లు చేశారు.
బనశంకరి పోలీస్ స్టేషన్లో సయ్యద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం వల్ల అసలు వ్యవహారం బయటపడింది. నిందితులు చెప్పింది నమ్మి సయ్యద్ రూ. 50వేలు డిపాజిట్ చేశాడు. తొలుత వీడియోలు, ఫొటోలు లైక్ చేసినందుకు అతడికి డబ్బులు అందేవి. ఇంకొందరిని ఈ పార్ట్‌టైమ్ ఉద్యోగంలో చేర్పిస్తే డబ్బులు ఎక్కువిస్తానని ఆశ పెట్టారు నిందితులు.. అది నమ్మి మరో 44మందితో రూ. 19.76లక్షలు డిపాజిట్ చేయించాడు సయ్యద్. ఆ తర్వాత సయ్యద్‌కు డబ్బులు అందలేదు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 210 మంది 'ఆన్లైన్ మోసాల' బాధితులను విచారించారు. దొరికిన ఆధారాలతో 14మందిని అరెస్ట్ చేశారు. రూ. 5.40కోట్ల బ్యాంకు డిపాజిట్లను జప్తు చేశారు.
ఇదీ చూడండి:- ఫేక్ ఆన్లైన్ పోర్టల్‌తో రూ. 5లక్షల మోసం
కీప్ షేర్..
మరో ఘటనలో చైనాలోని సాఫ్ట్వేర్ డెవలపర్స్ సహాయంతో 'కీప్ షేర్' అనే యాప్‌ను రూపొందించిన నిందితులు.. ప్రజలకు పార్ట్‌టైమ్ వల వేశారు. సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు లైక్ చేసి షేర్ చేస్తే రూ. 20 ఇస్తామని నమ్మించారు. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు. ఇందుకోసం అనేక బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు.
బెంగళూరుకు చెందిన తిప్పస్వామి అనే వ్యక్తి వీరి ఉచ్చులో పడి రూ. 4.83లక్షలు పోగొట్టుకున్నాడు. తిప్పస్వామి కోననకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అధికారులు రంగంలోకి దిగారు.
ప్రజల నుంచి నిందితులకు రూ. 25కోట్లు డిపాజిట్ల రూపంలో అందినట్టు దర్యాప్తులో భాగంగా తేలింది. 110 బ్యాంకు ఖాతాల్లోని రూ. 11కోట్లను పోలీసులు జప్తు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ హిమాచల్‌ప్రదేశ్ వ్యక్తితో సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. 7 ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:- ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం.. రూ. 32 లక్షలు మోసం