2 Years Baby Organ Donation : దేశ రాజధాని దిల్లీలో ఓ చిన్నారి తల్లిదండ్రులు పెద్దమనసు చాటుకున్నారు. ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌కు గురైన తమ రెండేళ్ల కుమార్తె శరీరంలోని అవయవాలను ఆపదలో ఉన్న వారికి దానం చేసేందుకు అంగీకరించారు. దీంతో ఇద్దరు పిల్లలకు వాటిని అమర్చడం వల్ల వారి ప్రాణాలు దక్కాయి.
ఇదీ విషయం..
దిల్లీకి చెందిన రెండేళ్ల దివ్యాన్షి మూడు అంతస్తుల బిల్డింగ్‌పై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడింది. దీంతో ఆ చిన్నారిని దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే బ్రెయిన్ డెడ్ కావడం వల్ల చిన్నారులు మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో బాలిక శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా ఉండడం వల్ల వాటిని అవసరాల్లో ఉన్న వారికి దానం చేయాల్సిందిగా చిన్నారి తల్లిదండ్రులను డాక్టర్లు కోరారు.
ఆర్గాన్ రిట్రీవల్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ (ORBO) ద్వారా చిన్నారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా ఇప్పించారు వైద్యులు. ఈ కౌన్సిలింగ్లో అవయవ దానం ప్రాముఖ్యత గురించి తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు.. చనిపోయిన తమ కుమార్తె అవయవాలను దానం చేసేందుకు ఒప్పుకున్నారు. దీంతో దిల్లీ NCRలో అతిచిన్న వయసులో అవయవ దానం చేసిన బాలికగా దివ్యాన్షి రికార్డులోకెక్కింది.
తల్లిదండ్రుల అనుమతితో సేకరించిన బాలిక గుండెను చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 8 నెలల పాపకు అమర్చారు వైద్యులు. అంతేకాకుండా దివ్యాన్షికి చెందిన రెండు కిడ్నీలను ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మరో 17 ఏళ్ల బాలికకు అమర్చారు. బ్రెయిన్ డెడ్ అయిన బాలికకు సంబంధించిన కళ్లను 'ఐ' బ్యాంక్‌లో భద్రపరిచారు.
36 గంటల్లో 3వ అవయవదానం!
మరోవైపు ఇదే దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో మరో అవయవదానం జరిగింది. ఈనెల 16న నోయిడాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో శశి అనే 48 ఏళ్ల మహిళ తలకు తీవ్రంగా గాయమైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ నవంబర్ 17న ఆమె బ్రెయిన్ డెడ్ కారణంతో మృతి చెందింది. దీంతో ఆమె అవయవాలను దానం చేసేందుకు ముందుకువచ్చారు కుటుంబ సభ్యులు. చనిపోయిన మహిళకు చెందిన రెండు కిడ్నీల్లోని ఒక కిడ్నీ ఎయిమ్స్‌లోని ఓ రోగికి, మరొకటి ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో పేషెంట్‌కు అమర్చారు డాక్టర్లు.
బద్రీనాథుడి ఆలయం మూసివేత- ఆరు నెలలు తర్వాతే దర్శనం
రాజ్యాంగ వర్ణమాలతో మురికివాడల పిల్లలకు పాఠాలు- ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు లాయర్ కృషి