ఇంకా బడిలోకే అడుగుపెట్టని ఆ చిన్నారి.. అప్పుడే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా.. అద్భుతమైన జ్ఞాపకశక్తితో అదరగొడుతోంది. కేవలం రెండున్నరేళ్ల వయస్సున్న చిన్నారి.. తన అసమాన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిమిషాల వ్యవధిలోనే వివిధ రకాల పక్షులు, జంతువుల పేర్లు.. వాటి శాస్త్రీయ నామాలను అలవోకగా చెప్పేస్తోంది. అతి కష్టమైన ఆంగ్ల పదాలను క్యూట్‌క్యూట్‌గా అప్పచెబుతోంది. ఆ చిన్నారే బంగాల్‌కు చెందిన అధిష్ఠాత్రి బిశ్వాస్. A నుంచి Z వరకు ప్రతి ఆంగ్ల అక్షరానికి ఒక్కో ఆటోమొబైల్ సంస్థ పేరును చెప్పి ప్రపంచ రికార్డు కైవసం చేసుకుంది అధిష్ఠాత్రి.
అధిష్ఠాత్రి తండ్రి అభిజిత్ బిశ్వాస్.. ఓ ప్రొఫెసర్. తల్లి రాజ్ కుమారి హోమ్ టీచర్. వీరంతా హూగ్లీ జిల్లా, చిన్సురాలోని దత్తా బగన్‌లో నివాసం ఉంటున్నారు. చిన్న వయస్సులోనే అద్భుతమైన జ్ఞాపక శక్తిని అలవరుచుకున్న చిన్నారి.. వివిధ రకాల కార్ల సంస్థల పేర్లను A నుంచి Z వరకు చెప్పేస్తోంది. 100 వరకు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు సమాధానాలను ఇస్తోంది. తనకు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే.. ఇండియన్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది చిన్నారి.
మా చిన్నారికి మాట్లాడటం అంటే చాలా ఇష్టం. వాటన్నింటిని రికార్డు చేసి, ఆ వీడియోను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలకు పంపాను. దాంతో అధిష్ఠాత్రి బిశ్వాస్ ప్రతిభను గుర్తించిన సదరు సంస్థలు.. ఆమెకు ఈ అవార్డులను ప్రకటించాయి.
-చిన్నారి తల్లి, రాజ్ కుమారి
"మేము ఆటల ద్వారానే ఆమెకు అన్నీ నేర్పించేందుకు ప్రయత్నిస్తాము. వివిధ రకాల విషయాల గురించి చిన్నారికి చెబుతాము. దీంతో ఆమెలో కంఠస్థం ధోరణి పెరుగుతుంది. ఆమె సాధించిన ఘనతల పట్ల మేమందరం చాలా గర్విస్తున్నాం." అని చిన్నారి తల్లి తెలిపారు.